- వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు
- తెప్పోత్సవం ఏర్పాట్లు పర్యవేక్షించిన ఈవో దామోదర్‌రావు
భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో గురువారం పరశురామావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. తర్వాత ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి అక్కడ పరశురామావతారంలో స్వామిని అలంకరించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత వేదపండితులు వేదవిన్నపాలు చేశారు.
నాళాయర దివ్యప్రబంధ పారాయణం తర్వాత ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని వేదికపైకి తీసుకెళ్లారు. భక్తుల దర్శనం తర్వాత సాయంత్రం తిరువీధి సేవను చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
భక్తులతో కిటకిట..
వీకెండ్, వరుస సెలవు దినాలు రావడంతో భద్రాచలం శ్రీరామదివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్తో పాటు శుక్ర, శని, ఆదివారాలు సెలవులు వచ్చి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధ్యయనోత్సవాలను తిలకించేందుకు ఉత్సాహం చూపించారు. ఉత్సవాలతో పాటు పాపికొండల విహారయాత్రకు కూడా టూరిస్టులు భారీ సంఖ్యలో వచ్చారు. క్యూలైన్లన్నీ భక్తులతో పోటెత్తాయి. స్వామివారి శోభాయాత్రతో పాటు తిరువీధి సేవలో కూడా భక్తులు పాల్గొన్నారు.
మాడవీధులతు భక్తులతో కళకళలాడాయి. తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. గోదావరి తీరంలో జరిగే తెప్పోత్సవం కోసం హంసావాహనం, వాహనం పైకి వెళ్లేందుకు నిర్మించే ర్యాంపు పనులను ఈవో దామోదర్‌రావు పర్యవేక్షించారు. ఈఈ రవీందర్‌రాజు ఆయనకు పనుల వివరాలను తెలియజేశారు. ర్యాంపు భద్రతపై ఒకటికి పదిసార్లు ట్రయల్స్ వేయాలని ఇంజినీర్లకు ఈవో సూచనలు ఇచ్చారు.
గజ ఈతగాళ్లతో పాటు, లైఫ్ జాకెట్లు, పడవలతో పర్యవేక్షణ, బాణాసంచాల కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రెస్క్యూ టీంల ఏర్పాటు గురించి ఇరిగేషన్ ఈఈతో చర్చించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని దేవస్థానం, ఇరిగేషన్ ఇంజినీర్లను ఈవో దామోదర్‌రావు ఆదేశించారు.
