కేసీఆర్ కు భయమేంటో చూపిస్త..

కేసీఆర్ కు భయమేంటో చూపిస్త..
  • నీ మంత్రులు, ఎమ్మెల్యేలే నీపై తిరగబడేలా చేస్త: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగుహుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అరాచకాలను బయటపెట్టినట్లే రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల చిట్టాలను బయటికి తీస్తామని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. ‘‘నీ మంత్రులు, ఎమ్మెల్యేలే నీపై తిరగబడేలా చేస్తా.. ఖబడ్దార్ కేసీఆర్.. నీకు భయమేంటో చూపిస్త’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. 2023లో రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని, అప్పుడు సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సంజయ్ మీడియాతో మాట్లాడారు. సాగర్ సభ సందర్భంగా సీఎం ఓ పోలీసు ఉన్నతాధికారిని పిలిపించుకొని బీజేపీ కార్యకర్తలను ఎవరినీ వదలొద్దని ఆదేశించారని, దీంతోనే పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను అరెస్టుల పేరుతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే. సీఎం కేసీఆర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మాటలు విని బీజేపీ కార్యకర్తలను వేధించినా, అర్ధరాత్రి వారి ఇళ్లల్లోకి వెళ్లి అరెస్టులు చేసినా.. ఇబ్బందులు పడుతారు” అని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులతో అరాచకాలు సాగిస్తూ, గూండాయిజం చేస్తున్నారని, సీఎం ఓ రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

వేధించడమే ఫ్రెండ్లీ పోలీసింగా?

బీజేపీ కార్యకర్తలను వేధించడమే ఫ్రెండ్లీ పోలీసింగా అని సంజయ్ ప్రశ్నించారు. ‘‘53 మంది బీజేపీ కార్యకర్తలను ఒకేసారి జైలుకు పంపారు. నలుగురు జిల్లా పార్టీ అధ్యక్షులు, పలువురు రాష్ట్ర నేతలను కూడా జైల్లో పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి అరెస్టులు జరగలేదు. అయినా బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్త కాదు. మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే, అదే స్థాయిలో సీఎం కేసీఆర్ కు భయమంటే ఏంటో నేను చూపిస్తా” అని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ తలెత్తే ప్రమాదం ఉందని, దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్ ఏ అధికారులనైతే నమ్ముతున్నారో, ఆ అధికారులే ఆయన్ను నిండా ముంచుతారన్నారు. వారి అరాచకాలతోనే జనంలో టీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకత పెరిగిందని విమర్శించారు. ఐజీ ప్రభాకర్ రావు కేసీఆర్ కు దోచి పెడుతున్నారని, అక్రమంగా కోట్ల ఆస్తులు కూడబెట్టాడని, బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆయన సంగతేంటో తేల్చుతామన్నారు.

గుణపాఠం చెప్తరు

బీజేపీ కార్యకర్తలపై పోలీసుల వేధింపుల గురించి రాష్ట్రంలోని మేధావులు ఆలోచిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని, సీఎం సంగతి చూస్తారని సంజయ్ ఫైర్ అయ్యారు. గుర్రంపోడుకు చెందిన 40 మంది గిరిజనులను 60 రోజులపాటు అక్రమంగా జైల్లో ఉంచిన పాపం వట్టిగనే పోదని, సాగర్ ఎన్నికల్లో వారే టీఆర్ఎస్ ను ఓడిస్తారని, అప్పుడు కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. సీఎం మాటలతో రాష్ట్రంలో గూండాలు రెచ్చిపోతున్నారని, మంథనిలో అడ్వకేట్ల హత్య ప్రభుత్వం చేయించిందేనని ధ్వజమెత్తారు. ఇందులో ఎంతో మంది అధికారులు, నేతల ప్రమేయం ఉందన్నారు.