కేసీఆర్,కేటీఆర్ కామారెడ్డి రండి:బండి సంజయ్

కేసీఆర్,కేటీఆర్ కామారెడ్డి రండి:బండి సంజయ్

మాస్టర్ ప్లాన్ తో భూమి పోతుందనే మనస్థాపంతోనే రాములు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ ఆరోపించారు. రాములుని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్,కలెక్టర్,ప్రజా ప్రతినిధులు కలిసి చేసిన ప్రభుత్వ హత్యగానే పరిగణించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డికి వచ్చే దాకా కలెక్టర్ కార్యాలయం వద్దనే కూర్చుంటానని చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని చెప్పారు. 

రాములు ఆత్మహత్య తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచి వేసిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ జోన్ కు బీజేపీ, కామారెడ్డి ప్రజలు వ్యతిరేకం కాదన్నారు. పేదల భూములనుప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధిచేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై పేద రైతుల పొట్టగొడుతున్నారని తెలిపారు. రైతులను కలిసి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాస్టర్ ప్లాన్ చేసి రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. అన్నదాతలకు  వాస్తవ విషయాలు చెప్పకుండా  ఎందుకు ఉన్నారని  ప్రశ్నించారు. 

కొంత మంది కలెక్టర్లు రియల్ వ్యాపారులతో దావత్ లకు పోతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతే బీఆర్ యస్ కండువా కప్పుకోవాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ లో ఏది అనుకూలంగా ఉంటే అదే చేస్తారా? పేదల భూములు గురించి పట్టించుకోరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి రైతుల సమస్యపై ఎందుకు స్పందించరని నిలదీశారు. కేటీఆర్ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిగా మారిపోయారని విమర్శించారు. తెలంగాణ లో 8 సంవత్సరాలు గా మాస్టర్ ప్లాన్ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఇప్పుడు భూముల కోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు. రైతులకు వాస్తవాలు చెప్పకుండా ముసాయిదా లేంటీని ప్రశ్నించారు.