
- దేశ ప్రజలే మోదీ కుటుంబం.. కేసీఆర్‌కు ఫ్యామిలీయే ముఖ్యం
- బీజేపీ గ్రాఫ్‌ను దెబ్బతీసేందుకే మోదీ దోస్త్ అంటున్నారని విమర్శ
- ఈ నెల 22న ‘‘ఇంటింటికి బీజేపీ’పేరుతో జనంలోకి వెళ్లాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: ‘‘కేసీఆర్.. ఈ తొమ్మిదేండ్లలో నువ్వు చేసిందేమిటి? రాష్ట్ర అభివృద్ధిపై ఎందుకు మాట్లాడటం లేదు. నిత్యం మోదీని తిడుతూ ఇతర రాష్ట్రాలకు పోతూ టైమ్ పాస్ రాజకీయాలు చేయడం తప్ప”అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ సర్వేలు చూసినా బీజేపీకే అనుకూలమని చెబుతున్నాయని, కేసీఆర్ సర్వేలోనూ ఇదే వెల్లడైందన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలైందని, మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తారన్నారు. మోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని, అందుకే ఇప్పుడు మోదీ తనకు మంచి మిత్రుడంటూ కొత్త జిమ్మిక్కులు స్టార్ట్ చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందన్నారు. ఇలాంటి కామెంట్లతో బీజేపీ, -బీఆర్ఎస్ ఒక్కటేననే భావన ప్రజల్లో కలిగించి, రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్‌ను పెంచేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీజేపీ మోర్చాల సమావేశానికి బండి సంజయ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంజయ్ మాట్లాడుతూ..‘‘మోదీ నాకు మంచి దోస్త్ అని కేసీఆర్ అంటున్నాడు. నీకు, మోదీకి దోస్తీ ఎక్కడిది. నువ్వు 24 గంటలు తాగుతూనే ఉంటావు. మోదీకి ఆ అలవాటే లేదు. దేశ ప్రజలే మోదీకి కుటుంబం. తెలంగాణ ప్రజల కంటే నీకు నీ కుటుంబమే ముఖ్యం. మోదీ నిజంగా నీకు దోస్త్ అయితే, రాష్ట్రానికి చాలా సార్లు వచ్చారు. ఎందుకు కలవలేదు. ఢిల్లీకి అనేకసార్లు పోయావు, ఎందుకు కలవలేదు. నీతి ఆయోగ్ మీటింగ్ జరిగితే అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరైతే, కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు. ఎందుకంటే మోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణుకుతడు. మోదీ వస్తేనే ఫాం హౌస్‌కు పారిపోయిన వ్యక్తి కేసీఆర్’’అని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
ధరణి పోర్టల్‌ను సరిదిద్దుతాం..
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని సంజయ్ మండిపడ్డారు. మోదీ పాలనలో ఇండియా 2047 నాటికి నంబర్ వన్ కాబోతోందన్నారు. ‘‘దేశ ప్రజలకు మోదీ 3 కోట్ల ఇండ్లు కట్టించారు. రాష్ట్రానికి 2.5 లక్షల ఇండ్లు ఇస్తే కేసీఆర్ కట్టివ్వలేదు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నాం. టాయిలెట్లు, శ్మశానవాటికలు సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఖర్చుపెడుతున్న నిధులన్నీ కేంద్రమే ఇస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అమలయ్యే ఏ సంక్షేమ పథకాన్ని తీసివేయం. ధరణి పోర్టల్‌లో లోపాలను సరిదిద్ది రైతులకు నష్టం కలగకుండా చేస్తాం’’అని స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందన్నారు. అవి ఆత్మహత్యలు కాదని, ప్రభుత్య హత్యలేనన్నారు. ఈ నెల 22న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్‌ల వారిగా ‘‘ఇంటింటికీ బీజేపీ’’పేరుతో ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సీఆర్ఎస్‌గా బీఆర్ఎస్ : జవదేకర్
టీఆర్ఎస్.. ఇప్పడు బీఆర్ఎస్‌గా మారిందని, ఎన్నికల నాటికి ఇది సీఆర్ఎస్ (కాంగ్రెస్ రాష్ట్ర సమితి)గా మారడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ‘‘దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ అవినీతి లేని పాలన చేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీ. అవినీతి, కుటుంబ పాలనే ధ్యేయంగా కేసీఆర్ పాలన కొనసాగుతోంది. కేసీఆర్‌ది 60 పర్సంట్ కరప్షన్ సర్కార్.. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. ఈ విషయాన్ని ఒక్కో మోర్చా కార్యకర్త ప్రతిరోజు మూడు ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయాలి. 2024 ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. నీళ్లు, -నిధులు, -నియామకాల నినాదానికి కేసీఆర్ నీళ్లొదిలారు. బీజేపీకి అవకాశమిస్తే ఈ నినాదాన్ని సాకారం చేసి తీరుతాం’’అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు బీజేపీకి మద్దతు పలుకుతూ 90909 02024 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు.
జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వండి..
జర్నలిస్టులు సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని? రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. వారికి స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 10 నెలలైనా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఈ స్థలం కోసం ఎదురుచూసి ఇప్పటికే 60 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని, ఇంకెంత మంది చస్తే కనికరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పేట్ బషీరాబాద్‌లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు హరీశ్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు.
తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జర్నలిస్టులు స్థలాలు ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేస్తామని సంజయ్ హెచ్చరించారు. జర్నలిస్టులకు స్థలాలు ఇప్పించే వరకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రూ.2 వేల కోట్ల విలువైన ఈ స్థలాన్ని కేసీఆర్ ఫ్యామిలీ కొట్టేయాలని చూస్తోందని ఆరోపించారు.