నలుగురి చెరలో రాష్ట్రం ..తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గాలికొదిలేసిండు

నలుగురి చెరలో రాష్ట్రం ..తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గాలికొదిలేసిండు
  • రాష్ట్రాభివృద్ధికి కేంద్రం రూ.4 లక్షల కోట్లు ఇచ్చింది
  • రేవంత్ మాదిరి పార్టీలు మారడం నాకు చేతకాదు
  • బీజేపీ రాష్ట్ర ఆఫీసులో అవతరణ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: నాలుగు కోట్ల మంది ఆకాంక్షల కోసం ఏర్పడ్డ తెలంగాణ.. నలుగురి చెరలో బందీ అయిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మూర్ఖపు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను సంజయ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర అభివృద్ధి కోసం, 4 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం 4 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. కేసీఆర్ మాత్రం ఆ నలుగురి కోసం పంచుకుంటూ తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేశాడు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రాకుండా కేసీఆర్ పారిపోతున్నాడు. కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమైందని అంటున్నారు. మరి రాష్ట్రంలో ఏ రైతన్నను పలకరించినా ఎందుకు కన్నీళ్లు పెడుతున్నారో సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి 

తెలంగాణ సాధన కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇచ్చిన నిధులతోనేనని చెప్పారు. తెలంగాణలో సంపదను సృష్టించేందుకు లక్షల కోట్లు కేటాయిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, కేంద్ర పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ‘‘ఎక్కడ చూసినా కేసీఆర్ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. యాడ్స్ కనిపిస్తున్నాయి. ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.” అని బండి సంజయ్ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, అధికార ప్రతినిధులు సీహెచ్ విఠల్, ఎన్వీ సుభాష్, రాణి రుద్రమ దేవి పాల్గొన్నారు.

దారుస్సలాంను పేద ముస్లింలకు ఇస్తం

‘‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొనలేదు. ఎంఐఎంను నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలి. జెండా ఎగురవేయనందుకు కేసీఆర్ కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలి. లేదంటే ఆరు నెలల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకొని పేద ముస్లింలకు ఇస్తాం” అని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కుడుందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ ఎక్కడుందో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను అడిగితే తెలుస్తుందన్నారు.

కౌంటర్ ప్రోగ్రామ్స్‌‌‌‌ నిర్వహిద్దాం

పార్టీ స్టేట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న  ముఖ్య నేతలతో సంజయ్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రోజూ ఏ రంగం అభివృద్ధిపై కార్యక్రమాలు చేపడుతుందో.. ఆయా రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు ఆయా  రంగానికి సంబంధించిన వారు పడుతున్న ఇబ్బందులను ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. శనివారం నుంచి ఈ నెల 22 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, ఎస్.కుమార్, గీతామూర్తి, ఆకుల విజయ, సీహెచ్ విఠల్, ఎన్వీ సుభాష్,  రాణి రుద్రమ, ఆలె భాస్కర్, దరువు ఎల్లన్న, పుల్లారావు పాల్గొన్నారు.