
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఖరీదైన పార్టీలని, మద్యం దరఖాస్తుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుంటే.. ఎమ్మెల్యే టిక్కెట్ కు దరఖాస్తు చేసుకునే నేతల నుంచి కాంగ్రెస్ పార్టీ డబ్బులు వసూలు చేస్తున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పేద, మధ్యతరగతి నాయకులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా ఈ రెండు పార్టీలు చేస్తున్నాయని మండిపడ్డారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని బండి సంజయ్ శుక్రవారం కరీంనగర్లోని అలుగునూరు బ్రిడ్జి వద్ద ఉన్న పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సమాజ పరిరక్షణ కోసం మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించి గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన మొనగాడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.
డబుల్ బెడ్రూమ్ఇండ్ల బాధితులకు అండగా శుక్రవారం అలుగునూరులో రాస్తారోకో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలతో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని మండిపడ్డారు. రేషన్ కార్డుల్లేక జనం ఆరోగ్యశ్రీసహా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిన ప్రభుత్వం 99, 999 రూపాయల వరకు మాత్రమే మాఫీ చేస్తుండటం సిగ్గు చేటని విమర్శించారు.