పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తం..రోహింగ్యాలు, పాకిస్తానోళ్లను తరిమికొడ్తం

పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తం..రోహింగ్యాలు, పాకిస్తానోళ్లను తరిమికొడ్తం
  • రోహింగ్యాలు, పాకిస్తానోళ్లను తరిమికొడ్తం: బండి సంజయ్‌
  • వాళ్ల ఓట్లతోనే టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ గెలవాలనుకుంటున్నయ్‌
  • హైదరాబాద్‌ను మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్ కానివ్వం
  • హిందువులను నరుకుతామన్న వాళ్లతో కేసీఆర్​ దోస్తీ
  • టీఆర్‌ఎస్‌ గెలిస్తే బీఆర్‌ఎస్‌ కూడా వస్తదన్న బీజేపీ స్టేట్‌ చీఫ్‌

హైదరాబాద్‌, వెలుగు: ‘గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తది. గెలవగానే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తం. రోహింగ్యాలు, పాకిస్తానోళ్లను తరిమికొడ్తం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయుల ఓట్లతో టీఆర్‌ఎస్‌, మజ్లిస్ గెలవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.  ‘వాళ్ల ఓట్లతో గెలవడం కూడా ఓ గెలుపేనా?.. భారతీయుల ఓట్లతో గెలవలేరా?’ అని నిలదీశారు.

 

‘వాళ్ల ఓట్లతో గెలవడం కూడా ఓ గెలుపేనా?.. భారతీయుల ఓట్లతో గెలవలేరా?’ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా ఉప్పల్‌లో మంగళవారం సంజయ్‌ ప్రచారం చేశారు. దేశభక్తులకు.. దేశద్రోహులకు మధ్య యుద్ధం జరుగుతోందని, తీర్పు ప్రజల చేతుల్లో ఉందని ఆయన అన్నారు. దేశ ద్రోహులకు ఇక్కడ స్థానం లేదని, రోహింగ్యాలు లేని హైదరాబాద్ కావాలన్నారు. హైదరాబాద్‌ను మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్ కానివ్వబోమని చెప్పారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల ఓట్లు లేని ఎన్నికలను బీజేపీ కోరుకుంటోందన్నారు. భాగ్యలక్మి అమ్మవారి గుడికి రమ్మంటే కేసీఆర్‌ తోక ముడిచారని, ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు.

జనం ఇబ్బంది పడుతుంటే బయటకు రాని సీఎం అవసరమా?

15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరుకుతామన్న వాళ్లతో చెట్టపట్టాలేసుకుని కేసీఆర్ తిరుగుతున్నారని సంజయ్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. బీజేపీని గెలిపిస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర అడ్డా పెట్టి దోస్తులిద్దరూ దద్దరిల్లేలా విజయోత్సవ సభ నిర్వహిద్దామన్నారు. ‘సిటీలో ఎక్కడికెళ్లినా బీజేపీకి మంచి ఆదరణ వస్తోంది. హిందూ సమాజం కోసం బరాబర్ కొట్లాడ్తం’ అని చెప్పారు. హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌ అనబోనని చెప్పిన బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యేను లోపలేస్తే ఎంత మంది బంగ్లాదేశీయులున్నారో తెలుస్తుందని, వాళ్లందరినీ తరిమికొడుతామని హెచ్చరించారు. రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులను తరిమికొట్టాలా వద్దా అని ప్రజలను అడిగారు. అందరూ బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే బయటికి రాని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. పేదలను కేసీఆర్ పట్టించుకోరని, తన సంతకం ఫోర్జరీ చేసి రూ.10 వేల సాయం అందకుండా చేశారని విమర్శించారు.