నేను గొర్ల పైసలు అడ్డుకున్నట్లు ప్రమాణం చేస్తవా?

నేను గొర్ల పైసలు అడ్డుకున్నట్లు ప్రమాణం చేస్తవా?

హైదరాబాద్, వెలుగు: “మునుగోడులో గొల్ల కురుమలకు గొర్ల పైసలు అడ్డుకున్నట్లు, నేను ఈసీకి లేఖ రాసినట్లు టీఆర్ఎస్ వాళ్లు ప్రచారం చేస్తున్నరు. నేను గొర్ల పైసలు అడ్డుకోలేదు. పేదలకు వచ్చే పథకాలను అడ్డుకునే తత్వం కాదు నాది. ఈ విషయంపై తడిబట్టలతో నా భార్యా పిల్లలతో కలిసి దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తా.. నువ్వు సిద్ధమా?” అని సీఎం కేసీఆర్‌‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టైమ్‌లో కూడా తాను దళిత బంధు ఆపినట్లు, ఈసీకి లేఖ రాసినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉంటున్న మునుగోడు ఓటర్లతో ఆదివారం నాగోల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ మాట్లాడారు. మునుగోడులో ధర్మయుద్ధం జరుగుతోందన్నారు. “పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకోండి. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలకు మంచి చేస్తున్న మొనగాడు గెలవాలా? గడీల పాలనలో కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు గెలవాలా? ఆలోచించి ఓటేయండి’’ అని సూచించారు.

కేసీఆర్.. చెల్లని రూపాయి

కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ ఆర్థిక సాయం చేస్తోందని, టీఆర్ఎస్ ఇచ్చే నిధులతోనే కాంగ్రెస్ మునుగోడు బైపోల్ ప్రచారం చేస్తోందని సంజయ్ ఆరోపించారు. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారిపోయారని, సీపీఐ జాతీయ మహా సభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమవద్ద సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపు ఖాయమని నివేదికలు చెబుతున్నాయని, టీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో చెల్లని రూపాయని, ఇక్కడ ఆయన పనైపోయిందని, ఇక బీఆర్ఎస్‌ను ఇతర రాష్ట్రాల్లో పట్టించుకునేదెవ్వరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలవాలని ఆ పార్టీ నేతలకే లేదన్నారు. “కేసీఆర్ కొడుకు పిరికిపంద. ఆయన అక్రమాలపై నేను మాట్లాడితే భయపడుతున్నడు. అందుకే నేను ఆయన గురించి మాట్లాడొద్దని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నడు” అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 

టీఆర్ఎస్ అభ్యర్థి దద్దమ్మనా?: ఎంపీ లక్ష్మణ్

గత ఎన్నికల్లో చెల్లని రూపాయి ప్రభాకర్ రెడ్డి.. ఉప ఎన్నికలో ఎట్లా గెలుస్తాడని లక్ష్మణ్ ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా క్యాడర్ లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని అన్నారు. రైతులు, విద్యార్థులు, టీచర్లు, అధికార పార్టీ సర్పంచులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేరన్నారు. మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ అంటున్నారని, మరి టీఆర్ఎస్ అభ్యర్థి దద్దమ్మా అని ప్రశ్నించారు.

ప్రజలను కేసీఆర్ మోసం చేస్తుండు: ఈటల

ప్రజలకు సహాయం చేసే గుణం ఉన్న నేత రాజగోపాల్ రెడ్డి అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, మునుగోడు అభ్యర్థిని చూసి కాకుండా తనను చూసి ఓటెయ్యాలని సీఎం చెబుతున్నారని, అంటే ఇయ్యాల తెలంగాణలో ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏ స్థాయిలో విలువ ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ‘‘ఇప్పుడు తెలంగాణలో కొత్త సంస్కృతి వచ్చింది. ‘మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. పథకాలు వస్తాయి’ అని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.

మన కోసమే రాజగోపాల్ రాజీనామా

చండూరు,(మర్రిగూడ) వెలుగు: రాజగోపాల్ రెడ్డి మన కోసం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, ఆయనను  మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సంజయ్ అన్నారు. ఆదివారం మర్రిగూడ మండలంలో కార్యకర్తల మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో  ప్రజల బతుకులు బాగుపడతాయని అనుకుంటే..  కేసీఆర్, ఆయన కుటుంబం, టీఆర్ఎస్ నేతలు మాత్రమే బాగుపడ్డారని ఫైరయ్యారు. కేసీఆర్ కుటుంబ, నియంత పాలనను అంతం చేసి, గోల్కొండ ఖిల్లా  మీద కాషాయ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు.