
బీజేపీ పాదయాత్రకు జనం వస్తలేరని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి తెర లేపిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్రకు జనం రానప్పుడు.. భైంసా సభను ఎందుకు అడ్డుకున్నరని ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ యాత్రను చూసి టీఆర్ఎస్ భయపడుతోందన్నారు. నిర్మల్ జిల్లా కుంటాల బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ సభలు, కార్యక్రమాలకు జనం పోవట్లేదని.. పైసలిచ్చి చప్పట్లు కొట్టించుకునే పరిస్థితి ఉందన్నారు.
“కేసీఆర్ కుటుంబ సభ్యులు వందలు, వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నరు.. లిక్కర్ దందాలో పెట్టుబడులు పెడుతున్నరు. ఇదే సమయంలో రాష్ట్రం మాత్రం 5 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి పేరు మీద లక్ష రూపాయల అప్పు అయింది. ఒక్కసారి రాష్ట్రం పరిస్థితిని అర్ధం చేసుకోండి”అని సంజయ్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ లో ఎవరి జాగ ఎవరి పేరు మీద ఉందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.