- నాయకులు వర్గీయులపై జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి వర్గీయుల దాడి
- కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దౌర్జన్యం
- కెమెరాలు, సెల్‌ఫోన్లు గుంజుకొని వీడియోలను డిలీట్ చేసిన బీజేపీ లీడర్లు
నల్గొండ, వెలుగు : నల్గొండ పట్టణంలోని బీజేపీ ఆఫీస్ రణరంగంగా మారింది. అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి కార్యక్రమం వేదికగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, సీనియర్ నాయకుడు పిల్లి రామరాజు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు పార్టీ తరఫున సన్మానం చేయాలని భావించిన పిల్లి రామరాజు.. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
ఆయన ఒప్పుకోవడంతో గురువారం సన్మానం చేసేందుకు రామరాజు ఏర్పాట్లు చేయగా.. బుధవారం రాత్రి 11 గంటలకు వర్షిత్‌రెడ్డి ఫోన్ చేసి సన్మాన సభను వాయిదా వేయాలని సూచించాడు. ఇదిలా ఉండగా.. అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
జిల్లా అధ్యక్షుడు కొంత మంది నాయకులతో కలిసి వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత వచ్చిన పిల్లి రామరాజు సైతం వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేసి ఆఫీస్‌లో కూర్చున్నారు. తర్వాత జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి కల్పించుకొని ఆఫీస్‌కు వచ్చిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సన్మానం చేద్దామని నాయకులతో చెప్పారు. దీంతో అందరికీ సమాచారం ఇవ్వకుండా సన్మానం చేయడం కరెక్ట్ కాదని, త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిద్దామని రామరాజు సూచించారు.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వర్షిత్‌రెడ్డి వర్గీయులు, మోహన్‌రెడ్డి అనే వ్యక్తి రామరాజుపై దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో రామరాజు అద్దాలు విరిగిపోగా, కంటి కింద గాయమైంది. అనంతరం పిల్లి రామరాజు మాట్లాడుతూ... బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డిని మార్చాలని డిమాండ్ చేశారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారిని కలుపుకొని పోకుండా, ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.
జర్నలిస్టులపైనా దౌర్జన్యం
బీజేపీ ఆఫీస్ వద్ద జరిగిన గొడవను కవర్ చేసేందుకువెళ్లిన జర్నలిస్టులపైనా వర్షిత్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. వీడియో తీస్తుండడంతో కెమెరాలు లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు బీజేపీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు.
జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వర్షిత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ నచ్చజెప్పినా వినకపోవడంతో... చివరకు వర్షిత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని చెప్పడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.
