- రూ.600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా
- దూర ప్రయాణాలు చేసే వారిపైనే భారం: ఆఫీసర్లు
- నెలవారీ పాస్‌లు, ప్యాసింజర్ ట్రైన్ల ధరలు ఎప్పట్లాగే ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దేశవ్యాప్తంగా 8 జోన్ల పరిధిలో రైల్వే శాఖ పెంచిన చార్జీలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ టు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి దూర ప్రయాణాలు చేసే రైల్వే ప్రయాణికులపై ఈ భారం పడనున్నదని, సాధారణ ప్రయాణికులపై పెరుగుదల ప్రభావం ఏమీ ఉండదని రైల్వే అధికారులు చెప్తున్నారు.
జనరల్ క్లాస్‌లో ప్రయాణించే వారు ముఖ్యంగా 215 కి.మీలోపు జర్నీ చేసే వారి విషయంలో మార్పు లేదని, ఆపై వెళ్లేవారికి స్వల్ప మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. 215 కి.మీ. పైబడి ప్రతి కి.మీ.పై ఒక పైసా పెంచామని, నాన్ ఏసీ, ఏసీ క్లాస్ టికెట్లపై ప్రతి కి.మీ.కు 2 పైసలు, 500 కి.మీ.దాటితే కి.మీ.కు 10 రూపాయలు పెంచామని తెలిపారు. నెలవారీ పాస్లపైనే కాకుండా జిల్లాల వారీగా నడిచే ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్ల చార్జీలను పెంచలేదని వివరించారు.
ఆరు నెలల్లో ఇది రెండోసారి
గత ఆరు నెలల్లో రైల్వే శాఖ చార్జీలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూలైలో ఒకసారి చార్జీలను పెంచి రూ.700 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్న రైల్వే.. ఈసారి రూ.600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని భావిస్తోంది. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని, దీంతో పెరుగుతున్న మ్యాన్‌పవర్ వల్ల రైల్వేపై భారం పడుతోందని, అందుకే చార్జీలు పెంచామని అధికారులు ప్రకటించారు.
