- 2019 నుంచి 2025 వరకూ.. లెక్కలు చెప్పని కొందరు మిల్లర్లు
- గన్నీల విలువ రూ. 35 కోట్లు
యాదాద్రి, వెలుగు: రూ. కోట్ల విలువైన గన్నీ బ్యాగులు మిల్లర్లు అప్పగించడం లేదు. సీజన్ల వారీగా పెద్ద సంఖ్యలో గన్నీ బ్యాగులు కొందరు మిల్లర్లే వద్దే ఉండిపోతున్నాయి. మీ వద్ద ఎన్ని బ్యాగులు ఉన్నాయో లెక్కలు చెప్పాలని సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్కోరినా.. కొందరు మిల్లర్లు మినహా చాలా మంది లెక్కలు చెప్పడం లేదు.
2019 వానాకాలం నుంచి
జిల్లాలోని మిల్లుల్లో 2019-–20 వానాకాలం సీజన్ నుంచి 2024–-25 వరకూ లక్షల సంఖ్యలో గన్నీలు ఇస్తున్నారు. 2019 యాసంగిలో 33 మిల్లులకు సీఎంఆర్ ఇవ్వగా 2025 వానాకాలం సీజన్ నాటికి 49 మిల్లులకు చేరింది. వడ్లను మరాడించిన తర్వాత తిరిగి గన్నీలు సహా మిల్లర్లు అప్పగించాల్సి ఉంటోంది. అయితే వడ్లకు అప్పగించిన స్థాయిలో బియ్యానికి గన్నీలు అవసరం ఉండదు.
కొందరు మిల్లర్లు వాటిని అప్పగిస్తున్నా.. మరికొందరు అప్పగించడం లేదు. దీంతో 11 సీజన్లుగా ఇచ్చిన బ్యాగుల లెక్కలు చూపించాలని సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ మూడు నెలల క్రితం మిల్లర్లకు నోటీసులు ఇచ్చింది. సీజన్ల వారీగా తీసుకున్న గన్నీలు, సీఎంఆర్ సమయంలో తిరిగి ఇచ్చిన లెక్కలను కోరింది. అయితే కొందరు మిల్లర్లే స్పందించి లెక్కలు ఇచ్చారు. చాలా మంది లెక్కలు ఇవ్వలేదు. దీంతో సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ తన వద్ద ఉన్న లెక్కలను సరి చూసుకుంటోంది.
మిల్లుల్లో 1.31 కోట్ల గన్నీలు
మిల్లులకు 2019–-20 నుంచి 2024–-25 వానాకాలం సీజన్ వరకూ 7.74 కోట్ల గన్నీ బ్యాగులను వడ్లతో సహా సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ అందించింది. ఇందులో కొత్త బ్యాగులు 3.57 కోట్లు కాగా మిగిలినవి పాతవి ఉన్నాయి. ఇందులో 6.27 కోట్ల బ్యాగులను వివిధ సీజన్లలో మిల్లర్లు అప్పగించారు. 2022-–23 యాసంగి సీజన్ టెండర్ వడ్లకు సంబంధించిన గన్నీలు పోనూ ఇంకా 1.31 కోట్ల బ్యాగులకు పైగా అప్పగించాల్సి ఉందని సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ లెక్కల్లో తేల్చింది.
గన్నీల విలువ రూ. 35 కోట్లు
గన్నీల విలువ ఒక్కో సీజన్లో ఒక్కో విధంగా ఉంటుందని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు చెబుతున్నారు ఒక్కో గన్నీ బ్యాగును రూ. 70 నుంచి రూ. 80 చొప్పున సివిల్ సప్లయ్ వెచ్చించి కొనుగోలు చేస్తోంది. అదే విధంగా పాత గన్నీల విలువను ఒక్కొక్కటి రూ. 25 నుంచి రూ. 30 వరకూ లెక్కిస్తోంది. డిపార్ట్మెంట్కు మిల్లులు అప్పగించాల్సిన 1.31 కోట్ల గన్నీ బ్యాగుల్లో కొత్త, పాత వాటి విలువ సుమారు రూ. 35 కోట్లుగా ఉంటుందని డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది.
