గంటకో మాట మాట్లాడి రైతులను ఆగం చేసిండు

గంటకో మాట మాట్లాడి రైతులను ఆగం చేసిండు

దేశంలో 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తగ్గించదని కేసీఆర్ ను బండి సంజయ్  ప్రశ్నించారు. రాష్ట్రానికి లీటర్ పెట్రోల్ మీద వ్యాట్ ద్వారా రూ. 28 వస్తున్నాయని.. వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాలలో తెలంగాణ రెండోస్థానంలో ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ బహుభాషా కోవిదుడు కాదు, బూతుభాషా కోవిదుడు.. ఆయన ఏ భాషలోనైనా తిట్టగలడు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘కేసీఆర్ అంకుల్‎కి కోపమొచ్చింది. మమ్మల్ని తిట్టుకుంటూ కేసీఆర్ బాగా ఎంజాయ్ చేశాడు. కేసీఆర్ బహుభాషా కోవిదుడు కాదు.. బూతుభాషా కోవిదుడు. ఆయన ఏ భాషలోనైనా తిట్టగలడు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు. హుజురాబాద్ ఓటమి తర్వాత కూడా కేసీఆర్ లో మార్పు రాలేదు. రైతులు కార్లలో తిరుగుతున్నారన్నారు కదా.. రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలి. రైతు రుణమాఫీ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు. మీ సిద్దిపేట జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కేసీఆర్‎కు కనబడటం లేదా? ఉద్యోగాలు రాక.. ఊర్లకు పోయి ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నారు. గంటకో మాట మాట్లాడి రైతులను కేసీఆరే ఆగం చేశాడు. వరి వేయాలని ఓసారి, వేయొద్దని మరోసారి చెప్పడంతో రైతులు ఆగమయ్యారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగయితే చూపించాలి. రైతుల నుంచి వడ్లు కేంద్రమే కొంటోంది. కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లెటర్ ఇచ్చింది. బియ్యం కొనుగోళ్లపై ఎఫ్‎సీఐతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది. మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని కేంద్రం ఎక్కడ చెప్పింది.  

వానాకాలం పంటను కొంటామని కేంద్రం ఆగష్టు 31, 2021న లెటర్ ఇచ్చింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని గతంలోనే చెప్పింది. గత నెల అక్టోబర్ 21 నుంచి జనవరి 22, 2022 వరకు కొంటామని తెలిపింది. ఈ లెటర్ మీకు రాలేదా చెప్పండి, నేను పంపిస్తా. రైతు చట్టాల మీద కేంద్రంపై యుద్దం చేస్తా అంటున్నారు. ఈ చట్టాలను సుప్రీంకోర్టు ఇప్పటికే ఆపేసింది. ఢిల్లీకి పోతే రైతులే నిన్ను రాళ్లతో కొడతారు. 

పెట్రోల్ మీద వ్యాట్ పెంచలేదా?

2015లో పెట్రోల్ మీద 4 శాతం, డీజిల్ మీద 5 శాతం పెంచింది గుర్తులేదా? పెట్రల్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించదో చెప్పాలి. ఒక లీటర్ మీద కేంద్రానికి రూ. 27 వస్తే.. రాష్ట్రానికి వ్యాట్ ద్వారా రూ. 28 వస్తున్నాయి. కేంద్రానికి వచ్చే రూ. 27లలో కూడా రూ. 12 మళ్లీ రాష్ట్రానికే తిరిగి వస్తున్నాయి. వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాలలో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. రాజస్థాన్ మొదటి ప్లేస్‎లో ఉంది. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ కిందకు తెస్తామంటే ఎందుకు వద్దన్నావ్? దేశంలో 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే.. మీరు ఎందుకు తగ్గించరు? తెలంగాణ నుంచి కేంద్రానికి వివిధ పన్నుల రూపంలో 2లక్షల 72 వేల కోట్లు వచ్చాయి. వాటిలో కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణకు 2లక్షల 52వేల 908 కోట్లు తిరిగి ఇచ్చింది.

తాగి బండి నడిపితే కేసు.. మరి తాగి రాష్ట్రాన్ని నడిపితే..

కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నేను తాగుతాను.. మీరు తాగండి అంటున్నారు. మందు తాగి వాహనం నడిపితే కేసు.. మరి మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే తప్పో కాదా? సీఎం చెప్పాలి. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీపై నమ్మకం లేనప్పుడు.. సమావేశాలకు ఎందుకు హాజరయ్యారో చెప్పాలి? ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చిన వ్యక్తి కేసీఆర్.