
హైదరాబాద్, వెలుగు: ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర సర్కారు నిజాలను దాచిపెట్టి బీజేపీని బద్నాం చేస్తున్నదని, వాస్తవాలు బయటకు రావాలని తాము కోరుకుంటున్నామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఫామ్‌హౌస్ కేసు విచారణను సీబీఐకి హైకోర్టు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని సోమవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం కేసీఆరే అని విమర్శించారు. ఆ కేసుకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌కు ప్రగతి భవన్ అడ్డాగా మారిందన్నారు. కేసీఆర్ సర్కారు ఆడుతున్న డ్రామాపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. నేరస్తులను కాపాడేందుకే ‘సిట్’ విచారణ చేస్తున్నట్లు కనిపిస్తున్నదన్నారు. లిక్కర్, డ్రగ్స్, అవినీతి కేసుల్లో నిండా కూరుకుపోయిన తన ఫ్యామిలీని కాపాడుకొనేందుకు కేసీఆర్ అల్లిన కట్టుకథే ఈ కేసు అని సంజయ్ ఫైరయ్యారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. సీబీఐ దర్యాప్తులో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ కేసులో బీజేపీని బద్నాం చేసే కుట్ర జరుగుతోందని మొదటి నుంచి చెబుతున్నామని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అనేది సీబీఐ దర్యాప్తులో తెలుస్తుందన్నారు.