కేసీఆర్​ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైంది: బండి సంజయ్

కేసీఆర్​ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైంది: బండి సంజయ్
  • కేసీఆర్​ ఫ్యామిలీకి అహంకారం ఎక్కువైంది

  • రోజూ మంది కొంపలు ముంచాలని చూస్తున్నరు

  • కొందరు పోలీసులు టీఆర్​ఎస్​ కార్యకర్తల్లా పనిచేస్తున్నరు

  • సిట్ నోటీసులిస్తే తీసుకుంట.. వాళ్ల లెక్క పట్టీలు వేసుకొని వీల్ చైర్​లో కూర్చోను

  • సినిమాను కేసీఆర్​ స్టార్ట్​ చేస్తే.. ముగింపు తామే ఇస్తామని హెచ్చరిక

  • అర్వింద్​ ఇంటికి వెళ్లి పరామర్శ

  • కవిత వీధి రౌడీలా మాట్లాడింది: విజయశాంతి

హైదరాబాద్, వెలుగు: ‘‘ఎంపీ అర్వింద్​ను ఉరికించి కొడ్తమని ఎమ్మెల్సీ కవిత అంటున్నరు.. త్వరలో రాష్ట్ర ప్రజలే టీఆర్ఎస్ ను, కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి ఉరికించి తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నరు. ఈ విషయం ఆమె గుర్తుంచుకోవాలి’’ అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్​ హెచ్చరించారు.  టీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోయిందని, కేసీఆర్ కుటుంబంలో అంత:పుర కలహాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ‘‘కేసీఆర్ సీఎంగా, కుటుంబ పెద్దగా, తండ్రిగా  పూర్తిగా ఫెయిల్  అయిండు.  అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకే దాడులతో డ్రామాలు ఆడుతున్నరు” అని అన్నారు. ‘‘అర్వింద్​ ఇంటిపై టీఆర్ఎస్ గూండాల దాడిని ఖండిస్తున్నం.. దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన బూతులేమీ మాట్లాడలేదే.. వాస్తవాలను ప్రజల ముందుంచారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తరా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శనివారం ఎంపీ అర్వింద్ ఇంటికి బండి సంజయ్​ వెళ్లి.. టీఆర్ఎస్  దాడిలో ధ్వంసమైన ఇంట్లోని ఫర్నిచర్, అద్దాలు, దేవుడి పటాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంజయ్​ మీడియాతో మాట్లాడుతూ.. దాడి ఘటనకు పోలీసులే బాధ్యులని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ‘‘కొందరు పోలీసులు పింక్ డ్రెస్ వేసుకుని టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పని చేస్తున్నరు. ఇది క్షమించరాని విషయం” అని అన్నారు. అర్వింద్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను డీకే అరుణ, తాను  కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని,  అర్వింద్ తో అమిత్​ షా ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారని సంజయ్​ తెలిపారు. ‘‘అర్వింద్​ అమ్మానాన్నలు పెద్దవాళ్లు.. నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నరు.. మంచానికే పరిమితమయ్యారు.. దాడి సమయంలో అదృష్టవశాత్తు ఇంట్లో లేరు.. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏమిటి? ఈ ఇంటిలో ఉన్న మహిళలపై టీఆర్ఎస్ గూండాలు రాళ్లు విసరడం అందరం చూసినం. మహిళల గురించి మాట్లాడే టీఆర్ఎస్ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తరు?” అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువైందని, బీజేపీ చేతిలో ఓటమి ఖాయమనే ఫోబియా పట్టుకుందని సంజయ్  అన్నారు. ‘‘ఇంటిలో వినాయకుడు, లక్ష్మీ, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలను ధ్వంసం చేశారు..హిందువులు దైవంగా భావించే తులసీ మొక్క ఉన్న కుండీని పగులగొట్టారు.. నిఖార్సయిన హిందువు అని చెప్పుకున్న కేసీఆర్..ఇలా దాడి చేయిస్తరా..? హిందువులైన వారు ఇలాంటి పనులు చేస్తరా.. హిందూ సమాజం ఇలాంటి వారిని ఎందుకు చూస్తూ భరించాలి..” అని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ ల పేరుతో టీఆర్ఎస్ నేతలు ఏదో డ్రామా చేద్దామనుకున్నారని, కానీ జనం నమ్మలేదని, డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లుగా పరిస్థితి తారుమారైందని ఆయన అన్నారు.  ‘‘అర్వింద్ విమర్శిస్తే.. వాళ్ల కుటుంబ సభ్యులపై, ఇంటిపై దాడి చేయడమేంది..? వాళ్లకు ఏం సంబంధం..?  రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?” అని ప్రశ్నించారు.  

కేసీఆర్​నే పట్టించుకోలే.. ఆయన బిడ్డనెవరు పట్టించుకుంటరు?

బీజేపీలో చేరాలంటూ తనను అడిగారన్న కవిత వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ.... ‘‘కేసీఆర్ నే పట్టించుకోలేదు..ఇక ఆయన బిడ్డను ఎవరు పట్టించుకుంటరు?” అని అన్నారు. రాజకీయాల్లో దాడులు చేసే సంస్కృతి మంచిది కాదని, తమ కార్యకర్తలు దాడి చేసినా తప్పే అని పేర్కొన్నారు.  సంజయ్​ వెంట మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ నేతలు గంగిడి మనోహర్ రెడ్డి, ఎస్.కుమార్, సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్ ఉన్నారు.

ముగింపు మేమే ఇస్తం

ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై బీఎల్ సంతోష్ కు సిట్​ నోటీసులిచ్చిందని, త్వరలో మీకు కూడా ఇస్తుందనే  ప్రచారం జరుగుంతున్నదని  మీడియా సంజయ్​ దృష్టికి తేగా.. ‘‘మాకు నోటీసులు కొత్తకాదు.. నోటీసులు వస్తే వాళ్లలెక్క పట్టీలు వేసుకోను.. వీల్ ఛైర్ లో కూర్చోను... బరాబర్ తీసుకుంటా..’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ సినిమాను ముఖ్యమంత్రి కేసీఆర్ స్టార్ట్ చేస్తే.. దీనికి ముగింపు మేమే ఇస్తం... ఏం చేస్తామో త్వరలో మీరే చూస్తరు..”అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.