నదులకు నడక నేర్పిన కేసీఆర్..మోటార్లకు ఈత నేర్పలేదా

నదులకు నడక నేర్పిన కేసీఆర్..మోటార్లకు ఈత నేర్పలేదా

ప్రజల బాధలు పోవాలంటే..బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు ఠంచన్ గా జీతాలు రావాలన్నా..అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ కల్వకుంట్ల జాగీరా..పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికేనా అని ప్రశ్నించారు. దేశ్ కీ నేత..దిన్ బర్ పీతా..ఫాంహౌజ్ మే సోతా..అమాస పున్నానికి ఆతా అంటూ ఎద్దేవా చేశారు. అగడుగునా అవమానించినా అల్లుడికి సిగ్గులేదని..నోటి నిండా అబద్దాలే వల్లిస్తున్నాడంటూ హరీష్ రావుపై మండిపడ్డారు. క్లౌడ్ బరస్ట్ తో అంతర్జాతీయ జోకర్ గా కేసీఆర్ మారాడని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొల్లగొట్టిన వారికి మద్దతుగా ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ కు ఈడీ విచారణ తప్పదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని 5 జిల్లాలలో ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర చేపట్టినట్లు బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 రోజుల పాటు మురళీధర్ రావు పాల్గొంటారని చెప్పారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను చెప్పడానికే ఈ భరోసా యాత్ర చేపట్టామన్నా ఆయన..అక్టోబర్ 2 నుండి ప్రజా సంగ్రామ యాత్ర మొదలవుతుందని తెలిపారు. ఫాంహౌస్ పాలన చేసే సీఎం ఉండడం మన దౌర్భాగ్యామన్నారు.  30వేల కోట్ల ప్రాజెక్ట్ ను లక్షా 30వేల కోట్ల రూపాయలకు పెంచి ప్రజలు సొమ్మును దోచేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ నీళ్లలో మునిగిన మోటార్లకు ఈత నేర్పలేదా అని ప్రశ్నించారు. 

రైతుబంధు మాత్రమే ఇచ్చి దళితబంధు సహా అన్నింటిని ఆపేశారని బండి సంజయ్ ఆరోనించారు. పంటలకు మద్ధతు ధర పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని..మోడీ రాక ముందు1310 రూపాయలు ఉన్న మద్ధతు ధర ఇప్పుడు 1960 ఉందని చెప్పారు. తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ తేవడమే బీజేపీ లక్ష్యమన్నారు. శ్రీలంక పరిస్థితులే రాష్ట్రంలో ఉన్నాయని..ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. విద్యుత్, బస్, పెట్రోల్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న కేసీఆర్..కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, ప్రజలకు అండగా ఉండేందుకే ప్రజా గోస - బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో మార్పు కొరకే తమ పోరాటం అని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కట్టి ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రజాకార్ల సహకరించిన ఓవైసీ కుటుంబానికి కేసీఆర్ సహకరిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు.