పాలమూరు ఎక్కడ పచ్చవడ్డది?

పాలమూరు ఎక్కడ పచ్చవడ్డది?
  • ఏడ చూసినా ఎండిన చెట్లే.. 
  • నీళ్లు లేవు.. నిలువ నీడ లేదు
  • ప్రజలు ప్రశ్నిస్తే మంత్రి కేసులు పెట్టిస్తుండు.. అరెస్టులు చేయిస్తుండు
  • ఇక్కడి ఎమ్మెల్యేలు వందల కోట్ల అవినీతి చేస్తున్నరని ఫైర్

మహబూబ్‌నగర్/దేవరకద్ర, వెలుగు: వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్లేనన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని ఎడారి చేసిండు. పాలమూరు పచ్చబడిందని చెబుతున్న కేసీఆర్.. ఎక్కడ పచ్చబడిందో చెప్పాలి. పాదయాత్రలో ఎక్కడ చూసినా ఎండిన చెట్లే కనిపిస్తున్నయ్. తాగేందుకు నీళ్లు లేవు.. నిలువ నీడ కూడా లేదు” అని చెప్పారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని, ఇక్కడి రైతులు పంటలకు సాగునీటి కోసం అందరి కాళ్ల మీద పడాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ఎమ్మెల్యేల్లో ఒకరు చెక్ డ్యాంల పేరుతో రూ.120 కోట్లు, మరో ఎమ్మెల్యే ఇసుక దందాతో రూ.వంద కోట్లు సంపాదించారని ఆరోపించారు. పనులు చేయడానికి వస్తున్న కాంట్రాక్టర్ల నుంచి టీఆర్ఎస్ లీడర్లు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. 

లెక్కలు అప్పజెప్తం
ప్రజలు ప్రశ్నిస్తే ఇక్కడి మంత్రి కేసులు బనాయిస్తున్నారని, అరెస్టులు చేయిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవరకద్రలో టాయిలెట్స్ నిర్మాణం, రైతు వేదికలకు, పల్లె ప్రకృతి వనం ఇలా వివిధ పథకాలకు కేంద్రం నిధులిస్తోందని గుర్తుచేశారు. కేసీఆర్‌‌కు ఈ లెక్కలు అప్పచెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పాలమూరులో వలసలు ఉన్నాయని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్ నిరూపించుకోలేకపోతే కుటుంబం మొత్తం తెలంగాణ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేశారు.

ఏ ముఖం పెట్టుకుని రాహుల్ వస్తుండు: రఘునందన్

ప్రజా సంగ్రామ యాత్రలో తెలుసుకున్న సమస్యలనే బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. కాంగ్రెస్ వల్లే 1,200 మంది యువకులు తెలంగాణ కోసం బలయ్యారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాహుల్​గాంధీ ఓయూకి వస్తున్నాడని ప్రశ్నించారు. మామా అల్లుళ్ల అరాచకాలకు, అవినీతికి వ్యతిరేకంగా దుబ్బాకలో ప్రజలు తీర్పు ఇచ్చారని, దేవరకద్ర ప్రజలు కూడా అలాంటి తీర్పు ఇవ్వాలని అన్నారు. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని నిలబెట్టుకోలేని రేవంత్ రెడ్డికి బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. బీజేపీతో ముఖాముఖి కొట్లాడితే ఏ పార్టీ బతికి బట్టకట్టలేదని, త్వరలో టీఆర్‌‌ఎస్‌కూ అదే గతి పడుతుందన్నారు. పాలమూరు ప్రజల వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్రలో 15 ఏండ్లు అవుతున్నా రైల్వే బ్రిడ్జ్ పూర్తి కాలేదని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్​రెడ్డి అన్నారు.