నువ్వేమో ఎక్కడైనా పంట అమ్ముకుంటవ్‌‌‌‌‌‌‌‌..రైతులు అమ్ముకోవద్దా?

నువ్వేమో ఎక్కడైనా పంట అమ్ముకుంటవ్‌‌‌‌‌‌‌‌..రైతులు అమ్ముకోవద్దా?
  • అగ్రి చట్టాల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నవ్​.. కేసీఆర్​పై బండి సంజయ్​ ఫైర్​

గంగాధర/ శంకరపట్నం/ కరీంనగర్​రూరల్/ రామడుగు/ చొప్పదండి, మాన కొండూరు, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్​ తన ఫాంహౌస్​లో పండించిన పంటను ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చు.. కానీ రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలా? వారికి ఇష్టమున్న చోట అమ్ముకుంటే తప్పేంది? రైతులకు పంట ధరను నిర్ణయించుకునే అధికారం ఉండొద్దా?” అని బీజేపీ స్టేట్​ చీఫ్​, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను సీఎం కేసీఆర్​ వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. కరీంనగర్​ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సంజయ్​ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో షరతుల వ్యవసాయ విధానంలో పంటలు సాగుచేయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.  రైతుల మేలు కోసం ప్రధాని మోడీ కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చారని, రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్​వాటిని వ్యతిరేకించడం ఏమిటని ప్రశ్నించారు.  రాష్ట్రంలోని రైతులను మాయమాటలతో ఇప్పటివరకు తన కబంధ హస్తాల్లో పెట్టుకున్న కేసీఆర్.. కేంద్రం తెచ్చిన చట్టాలతో  రైతులు ఎక్కడ మోడీని మెచ్చుకుంటారోనని భయపడిపోతున్నారని, అందుకే  వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే   ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. సన్న వడ్లు పండిస్తున్న రైతులకు కేంద్రం ఇస్తున్న మద్దతు ధరకు అదనంగా రాష్ట్రం రూ.500 ఇవ్వాలని సంజయ్​ డిమాండ్ ​చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకుసాగితేనే అభివృద్ధి సాధ్యమని, తనకు వచ్చే ఎంపీ నిధులను లోక్​సభ సెగ్మెంట్‌‌‌‌ పరిధిలోని అన్ని ఊర్ల అభివృద్ధికి కేటాయిస్తానన్నారు.

కొత్త చట్టంతో కంపెనీలపై చర్యలు తీసుకోవచ్చు

కరీంనగర్​ రూరల్ ​మండలం నగునూర్ లో రైతులకు వ్యవసాయ చట్టాలపై బండి సంజయ్  అవగాహన కల్పించారు. పాంప్లేట్స్​పంపిణీ చేశారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన సెప్టెంబర్​ 26న దేశంలోని రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన అన్నారు. ఇదివరకు గ్రామాల్లో సీడ్ విత్తనాల కంపెనీలు వచ్చి రైతులతో సాదా ఒప్పందాలు చేసుకొని నష్టపరిచేవారని, కానీ నూతన చట్టంతో ఒప్పందం ప్రకారం నడుచుకోని కంపెనీలపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. ఆంక్షల చట్రంలో చిక్కుకుపోయిన రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే, ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పిస్తూ మూడు చట్టాలు తీసుకువచ్చినట్లు వివరించారు. టీఆర్ఎస్​, కాంగ్రెస్, కమ్యూనిస్ట్​, ఇతర పార్టీలు ఈ చట్టాల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్​రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్​గౌడ్  తదితరులు పాల్గొన్నారు.