మా ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు.. ఇక ఐఫోన్లే వాడాలె : బండి సంజయ్

మా ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు.. ఇక ఐఫోన్లే వాడాలె : బండి సంజయ్

టీఆర్ఎస్ ప్రభుత్వం  బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ నాయకులంతా ఇప్పుడున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త ఐఫోన్లు తీసుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా దిగజారి దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ‘‘ బీజేపీ నేతలు, పార్టీతో ముడిపడిన విషయాలన్నీ.. మన పార్టీ నేతల కంటే ముందే టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసిపోతున్నాయి’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ, పదాధికారుల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. 

ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రధాన ఫోకస్ పెట్టింది. నిత్యం ప్రజల మధ్య ఉండేలా వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్ర  ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఈక్రమంలోనే ఇవాళ కోర్ కమిటీ, పదాధికారుల సమావేశం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగింది. ముందస్తు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలని నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. జనవరి 7న బూత్ కమిటీలతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చవల్ గా భేటీ కానున్నారు. రాష్ట్రంలో 34,600 బూత్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో బూత్ కమిటీలో 21మంది సభ్యులు ఉన్నారు. 34వేల 600 బూత్ కమిటీల్లోని 21 మంది సభ్యుల చొప్పున మొత్తం.. 7లక్షల 26వేల 600మందితో వర్చువల్ గా జేపీ నడ్డా సమావేశం కానున్నారు.