బీజేపీ సమావేశాలతో మీకెందుకు భయం?

బీజేపీ సమావేశాలతో మీకెందుకు భయం?

హైదరాబాద్, వెలుగు: ‘‘హైదరాబాద్​లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెడితే మీకు భయమెందుకు?” అని సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ నిలదీశారు. తెలంగాణకు మొట్టమొదటి ద్రోహి కేసీఆరే నని ఫైర్​ అయ్యారు. శుక్రవారం రాత్రి హెచ్​ఐసీసీ నోవాటెల్ లో పలు జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు సంజయ్  సమక్షంలో బీజేపీలో చేరారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకుపెట్టారని అడుగుతున్నరు.. ఇదేమైనా పాకిస్తానా, బంగ్లాదేశా?! తెలంగాణలో మీరేమైనా గిరి గీసుకున్నరా..?  కార్యవర్గ సమావేశాలే కాదు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినం. మీ సంగతి చెప్పేందుకే హైదరాబాద్​లో కార్యవర్గ సమావేశాలు పెట్టినం” అని కేసీఆర్​, కేటీఆర్​ను హెచ్చరించారు. మాటలు చెప్పి రాజకీయ లబ్ధిపొందే కేసీఆర్​, కేటీఆర్​ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ‘‘రాష్ట్రానికి నువ్వేం చేసినవ్​?  తెలంగాణ మొదటి ద్రోహివి నువ్వే. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టిన రోజు నువ్వు ఎక్కడున్నవ్​? ” అని కేసీఆర్​ను ప్రశ్నించారు.

1200 మంది బలిదానాల వల్ల, బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయం కేసీఆర్​ గుర్తుంచుకోవాలని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ సాధించుకుంటే నీళ్ల విషయంలో మొట్టమొదట ద్రోహం చేసింది కేసీఆరేనని మండిపడ్డారు. అబద్ధాలతో రాజ్యమేలే పార్టీ టీఆర్ఎస్  అని ఆయన దుయ్యబట్టారు. శ్రీలంక పరిస్థితి తెలంగాణకు వస్తుందని ఇక్కడి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి కుటుంబం మాత్రమే హోర్డింగ్ లలో, ఫ్లెక్సీలలో ఫొటోలు వేసుకుంటున్నరు. మంత్రులకు సిగ్గు లేదు. వాళ్ల డిపార్ట్​మెంట్లలో కూడా కేసీఆర్​ కుటుంబం ఫొటోలే వేసుకుంటున్నరు” అని విమర్శించారు. 

టీఆర్‌‌ఎస్​కు  వీఆర్‌‌ఎస్‌‌ తప్పదు 

టీఆర్‌‌ఎస్‌‌కు ఇక వీఆర్‌‌ఎస్‌‌ తప్పదని సంజయ్ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న టైమ్ లో టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. శంషాబాద్​ ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్.. బీజేపీ ఫ్లెక్సీలను అడ్డుకున్నంత మాత్రాన మమ్మల్ని అడ్డుకోలేరు. మా పార్టీ కార్పొరేటర్లను డబ్బుతో ప్రలోభపెట్టి, కేసులతో భయపెట్టి టీఆర్‌‌ఎస్‌‌లో చేర్చుకున్నరు” అని అన్నారు.