అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం

అధికారంలోకి వస్తే ఉచితంగా విద్య, వైద్యం

బంగారు తెలంగాణ అన్న సీఎం కేసీఆర్ సామాన్యులకు బతుకు లేకుండా చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ విజయవంతం కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని ఆయన దర్శించుకున్నారు. సంగ్రామ సభకు అమిత్ షా రావడంతో ప్రతి కార్యకర్తలో జోష్ వచ్చిందన్నారు. విమర్శలు చేసేవారికి  చెంప చెల్లుమనేలా అమిత్ షా స్పీచ్ కొనసాగిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు.

ఉచిత విద్య, ఉచిత వైద్యానికి కట్టుబడి ఉన్నామన్న బండి అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు ఎక్కువయ్యాయని.. బీజేపీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు పక్కా ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. తెలంగాణాలో వ్యాట్ తగ్గించకుండా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారన్న సంజయ్..బీజేపీ అధికారంలో వచ్చాక వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తామన్నారు. ఏడేళ్లుగా నష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని..వారికి ఫసల్ భీమా యోజన ద్వారా మేలు చేస్తామని చెప్పారు. ఇక 4శాతం మైనారిటీ రిజర్వేషన్ తొలగించి ఎస్సీ, ఎస్టీ, బిసీ లకు అందిస్తామన్నారు. తెలంగాణాలో ఆకు పచ్చ జెండాలను తొలగించి రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మారుస్తామని బండి సంజయ్ తెలిపారు.