బీజేపీలో కొత్త పంచాది... బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్

బీజేపీలో కొత్త పంచాది... బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్
  • ఇద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలు
  • స్థానిక ఎన్నికల వేళ కేడర్​లో కలవరం.. స్పందించని ఇతర పెద్ద నేతలు
  • పరిణామాలపై ఆరాతీస్తున్న పార్టీ హైకమాండ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో వరుస పంచాయితీలు ఆ పార్టీ హైకమాండ్​కు తలనొప్పిగా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  గోషామహల్ ఎమ్మెల్యే -రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో.. ఇంతలోనే మరో పంచాయితీ తెరమీదికి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్  మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఇది పార్టీ కేడర్​ను అయోమయానికి గురిచేస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికల టైమ్ దగ్గరపడ్తున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయితీ వారిని కలవరపెడ్తున్నది. ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్​ ఆరా తీస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు సోమవారం ఢిల్లీకి వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది.

బండి సంజయ్​, ఈటల రాజేందర్​ మధ్య మొదటి నుంచి కొంత గ్యాప్​ ఉన్నట్లు పొలిటికల్​ సర్కిల్​లో చర్చ జరుగుతున్నది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి బండి సంజయ్​ని  పార్టీ అధిష్టానం తప్పించింది. దీనికి ఈటల కూడా ఓ కారణమని సంజయ్​ వర్గీయులు అంటున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల ఉండగా.. ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీనికి బండి సంజయ్ కారణమని ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. 

బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్‌‌‌‌‌‌‌‌ లో ఇటీవల టెన్త్ స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అనుచరులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు వ్యక్తి పూజలు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని ఇన్ డైరెక్ట్​గా ఆయన వర్గీయులకు బండి సంజయ్​ వార్నింగ్ ఇచ్చినట్టు నేతలు చెప్తున్నారు. ఇదే క్రమంలో కొత్త  కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని ఈటల వర్గీయులు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ఈటల వర్గానికి చెందిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గౌతంరెడ్డి రాజీనామా చేశారు. 

దీంతో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి. రెండ్రోజుల కింద హుజూరాబాద్ సెగ్మెంట్​లోని ఈటల అనుచరులంతా శామీర్‌‌‌‌‌‌‌‌ పేటలోని ఆయన నివాసంలో భేటీ అయ్యాయి. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న బాధలను చెప్పుకున్నారు. ఇందులో నేరుగా బండి సంజయ్​పేరు ప్రస్తావించకుండా ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గుర్తించి టికెట్ ఇస్తే సరే లేదంటే.. హుజూరాబాద్ గడ్డ మీద ప్రతి ఊర్లో తమ సర్పంచ్ ఉంటారని ఆయన ప్రకటించారు. 

వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా.. ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్​పర్సన్​ వరకు అన్నింటిలో పోటీలో తమ వాళ్లు ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. మౌనంగా ఉండే వాన్ని బలహీనుడిగా చూడొద్దని, తన జోలికి రావద్దని వ్యాఖ్యలు చేశారు. దీనిపై బండి సంజయ్ ఇంకా స్పందించలేదు.  

స్థానిక ఎన్నికల వేళ పార్టీలో పరేషాన్​

త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగనుండగా.. ఇలాంటి టైమ్​లో ఇద్దరు కీలక నేతల నడుమ కోల్డ్​ వార్​ బీజేపీ కేడర్​ను కలవరపెడ్తున్నది. ఇది ఎంతవరకు ముదురుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఇతర నేతలు ఎవరూ స్పందించకపోవడం.. హైకమాండ్​ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్​ లేకపోవడం కేడర్​ను ఇంకింత కుంగుబాటుకు గురిచేస్తున్నది. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం ఇంకా కొనసాగితే  రూరల్ ఏరియాలో బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడొచ్చని కేడర్​ భావిస్తున్నారు.