కేంద్రంలో ఉన్నది మేమే..పోలీసులకు సంజయ్ వార్నింగ్

కేంద్రంలో ఉన్నది మేమే..పోలీసులకు సంజయ్ వార్నింగ్
  • కార్యకర్తలను కొట్టింది లెక్క రాస్కుంటున్నం .. త్వరలోనే అప్పజెప్తం
  • ఎస్‌‌ఈసీ, డీజీపీ కరెక్టుగ పని చేయాలె.. లేకుంటే ప్రజలే తిరగబడ్తరు
  • మంత్రుల పైరవీలతో పోస్టింగ్‌ లు పొంది జాబ్‌ చేస్తే ఇట్లే ఉంటది

హైదరాబాద్, వెలుగు‘సీఎం కేసీఆర్ డైరెక్షన్‌‌లో పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌‌ఈసీ) అధికారులు పని చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేయండి. లేదంటే ప్రజలే తిరగబడ్తరు’ అని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ బండి సంజయ్‌‌ హెచ్చరించారు. ‘డీజీపీ గారు.. మా కార్యకర్తలను ఎంత మందిని కొట్టించారో లెక్క రాసుకుంటున్నం. ఆ లెక్కలను త్వరలోనే మీకు అప్పజెప్పుతం’ అని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనేనని మరిచిపోవద్దన్నారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సిటీలోని పలు డివిజన్లలో టీఆర్ఎస్ నేతలు జరిపిన దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను బుధవారం వాళ్ల ఇండ్లకు వెళ్లి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ కార్యకర్తలను పోలీసుల ముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కొట్టినా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అట్లే చూస్తూ ఉండిపోయారు’ అని ఆరోపించారు. ‘డీజీపీ, ఎన్నికల కమిషనర్ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. మీరు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారా?’ అని నిలదీశారు. సామాన్య జనం పోలీస్‌‌ స్టేషన్‌‌కు వెళ్తే న్యాయం జరుగుతుందనే  నమ్మకం లేకుండా పోయిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీలతో పోలీసులు పోస్టింగ్‌‌లు పొంది ఉద్యోగాలు చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని విమర్శించారు.

సీపీఐ, సీపీఎం గుర్తులు కూడా తెల్వయా?

ఎస్‌‌ఈసీ స్వతంత్రంగా పని చేయాలని, కానీ కేసీఆర్ సర్కారులో ఆ పరిస్థితి లేదని సంజయ్‌‌ అన్నారు. ఎస్‌‌ఈసీకి సీపీఐ, సీపీఎం గుర్తులు కూడా తెలియని పరిస్థితి ఉందంటే కమిషన్‌‌ పనితీరు ఎట్లుందో అ ర్థమవుతోందన్నారు. ఓటు హక్కు కూడా లేని ఓ స్టూడెంట్‌‌కు పోలింగ్ బూత్‌‌లో ఎన్నికల డ్యూటీ అప్పగించడం కంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు. వెంగళరావునగర్‌‌లో మల్లేశ్వర్‌‌రావు అనే బీజేపీ కార్యకర్త కాషాయం అంగి వేసుకున్నాడ ని పోలింగ్ బూత్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు కొ ట్టారని, కాషాయం అంటేనే సీఎంకు భయం పట్టుకుందన్నారు. ‘కేసీఆర్ పచ్చ చొక్కా వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. సీఎం తినే అన్నంలోనూ పచ్చ రంగు కలుపుకున్నా ఇబ్బంది లే దు. కానీ కాషాయ జెండా జోలికొస్తే ఊరుకోం’ అని హెచ్చరించారు. సీఎం గడీల పాలన చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు.