
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని చర్చ సాగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీని పూర్తి సన్నద్ధంగా ఉంచేలా క్యాడర్ ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్ ఇచ్చి బస్సు యాత్ర ప్రారంభిస్తామని ఆ పార్టీ వెల్లడించింది. ఆ యాత్ర లో కవర్ కాని అసెంబ్లీ నియోజకవర్గాలు బస్సు యాత్రలో కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నామని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న సంజయ్.. అది ముగిసిన తరువాత జంట నగరాల్లో పాదయాత్ర చేస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి.
పది రోజుల్లో ఈ యాత్ర ముగించేలా రూట్ మ్యాప్ ను సంగ్రామ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి ఖరారు చేస్తున్నారు. ఓ వైపు యాత్ర కొనసాగిస్తూనే బ్రేక్ టైమ్ లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల నేతలతో సంజయ్ రివ్యూ చేపడుతున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ నేతలతో సమేశమై జిల్లాలు, నియోజకవర్గవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు సంజయ్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మల్, మంచిర్యాల జిల్లాల రివ్యూలు పూర్తికాగా, సోమవారం నుంచి వరుసగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. ఐదో విడత సంగ్రామ యాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నేతలతో సమీక్ష పూర్తి చేయనున్నారు. తరువాత దక్షిణ తెలంగాణ జిల్లాల సమీక్షపై సంజయ్ ఫోకస్ పెట్టనున్నారు.