
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకెళ్లి హడావుడిగా స్టేట్ మెంట్ రికార్డు చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తనపై లీగల్ టీం దర్యాప్తు చేస్తున్న విషయం పైలట్‌కు తెల్వదని.. తెలిస్తే వాస్తవాలు చెప్పేస్తారని సీఎం కేసీఆర్ భయడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముందుగా పైలట్‌తో 164 సీఆర్పీసీ కింద జడ్జి ముందు వాంగ్మూలం ఇప్పించారని విమర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో మీడియాతో చిట్ చాట్ లో బండి సంజయ్ మాట్లాడారు.
ఈసందర్భంగా 'బెంగళూరు డ్రగ్స్ కేస్' పై సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను రీఓపెన్ చేయిస్తున్నామని తెలిపారు. వాటిని రీఓపెన్ చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయన్నారు. వాటిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఎంతవరకు ఉందో తెలిసిపోతుందని చెప్పారు. ఓ హీరోయిన్ తో కలిసి విదేశాల్లో డ్రగ్స్ తీసుకున్న నేత పేరు కూడా బయటికి వస్తుందని ఆయన కామెంట్ చేశారు. “ బెంగళూరుకు వెళ్ళిన మా లీగల్ టీం అక్కడి అధికారులను డ్రగ్స్ కేస్ కు సంబంధించిన వివరాలను అడిగితే... అందులోని ఒక అధికారి నేరుగా కేసీఆర్ కు సమాచారం అందించారు. దీంతో కేసీఆర్ అలర్ట్ అయ్యాడు. ఈ కారణం వల్లే ఫామ్ హౌస్ కేసులో రోహిత్ రెడ్డిని తీసుకెళ్లి, హడావుడిగా స్టేట్మెంట్ రికార్డ్ చేయించారు” అని సంజయ్ వివరించారు. డ్రగ్స్ కేసులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గతంలో రోహిత్ రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. ఇది బయటికి వస్తే పైలట్ తన మాట వినడని.. ఫామ్ హౌస్ కేసు విషయాలు చెప్పేస్తాడని కేసీఆర్ భయపడుతున్నారని బండి సంజయ్ వెల్లడించారు.
ఎల్లుండి(ఈనెల 15న) మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ లోని 'ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్' లో 5వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర" ముగింపు సభ ఉంటుందని, దాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు.