సీఎం రేవంత్​రెడ్డిని కలవకపోవడం సరికాదు

సీఎం రేవంత్​రెడ్డిని కలవకపోవడం సరికాదు
  • ప్రజాస్వామ్య ప్రయోజనాలను విస్మరించిన ఏపీ సీఎం జగన్ 
  •  పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్​గౌడ్​ 

హైదరాబాద్,వెలుగు: ఏపీ సీఎం తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడి సీఎంను మర్యాదపూర్వకంగా కలవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆనవాయితీ అని  పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్​గౌడ్​ అన్నారు. ఈ సాంప్రదాయాన్ని ఏపీ సీఎం జగన్ పాటించక పోవడం దురదృష్టకరమన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ మధ్య అనేక అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు.

ప్రధానంగా రాష్ట్ర విభజన సమస్యలు, నీటి పంపకాలు, విద్యుత్, ఉద్యోగుల అంశాలు మాట్లాడుకోవాలన్నారు. కానీ ఏపీ సీఎం జగన్​ వ్యక్తిగత అంశాల కోసమే వచ్చి ప్రజాస్వామ్య ప్రజా ప్రయోజనాలను విస్మరించారని విమర్శించారు.

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అహంభావంతో మాట్లాడుతున్నారని, అతని మాటలను ఖండిస్తున్నామన్నారు. ఏపీలో జగన్ ​ఇంకా 3 నెలలే  సీఎంగా ఉండేది గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్  పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారన్నారు.  అహంభావంతో మాట్లాడిన బీఆర్ఎస్​ నేతలు అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఏపీలో కూడా వైసీపీ అడ్రస్​ లేకుండా పోవడం ఖాయమన్నారు.