
- మృతుల్లో 17 మంది స్టూడెంట్లు, ఇద్దరు టీచర్లు
- 171 మందికిపైనే తీవ్ర గాయాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్
- బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో ప్రమాదం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో ఘోరం జరిగింది. ఆ దేశ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్ ఓ స్కూల్ బిల్డింగ్ పై కూలిపోయింది. దీంతో పైలట్ సహా 20 మంది చనిపోయారు. 171 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పైలట్, ఇద్దరు టీచర్లు, 17 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఢాకా సమీపంలోని ఉత్తర టౌన్ లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానం ఎఫ్7 జీబీఐ (మేడిన్ చైనా) మధ్యాహ్నం 1.06 నిమిషాలకు టేకాఫ్ అయింది.
కొద్ది నిమిషాల వ్యవధిలోనే (1.15 గంటలకు) మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ బిల్డింగ్ పై కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పైలట్ తో పాటు 17 మంది స్టూడెంట్లు, ఇద్దరు టీచర్లు కాలి బూడిదయ్యారు. అలాగే, గాయపడిన వారిలో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో చాలామంది స్టూడెంట్లే ఉన్నారు. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఈ ప్రమాదంతో స్కూల్ లో స్టూడెంట్లు, టీచర్లతో పాటు సమీపంలో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆంబులెన్స్ లు కూడా ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించాయి. పలువురిని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో తరలించారు. చనిపోయిన పైలట్ ను ఫ్లైట్ లెఫ్టినెంట్ మొహమ్మద్ తౌకిర్ ఇస్లాంగా గుర్తించారు. యుద్ధ విమానం కూలిన సమయంలో స్కూల్ లో క్లాసులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గాయాలపాలైన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
టీవీలో వార్తలు చూసి షాకయ్యా
తాను చదువుతున్న స్కూల్పై ఫైటర్ జెట్ కూలిపోయిన వార్తలు టీవీలో చూసి షాకయ్యానని రఫికా తాహా అనే విద్యార్థిని తెలిపింది. స్కూల్ లో ఎలిమెంటరీ నుంచి 12వ తరగతి వరకూ మొత్తం 2 వేల మంది స్టూడెంట్లు చదువుతున్నారని ఆమె వెల్లడించింది. కాగా.. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ప్రమాదం ధాటికి ఓ క్లాస్ రూం శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఫైటర్ జెట్ పై శిథిలాలు పేరుకుపోయాయి. ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఘటనా స్థలంవైపు జనం పరుగులు పెట్టారు. కాగా.. జెట్ ఫైటర్ క్రాష్‌పై తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహ్మమద్ యూనుస్ ‘ఎక్స్’ లో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.