తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు రవాణా రంగంపై ఆధారపడి లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు జీవిస్తున్నారు. ట్రాఫిక్ చలానాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనూహ్య ప్రతిపాదన రోడ్డు రవాణారంగంపై ఆధారపడి జీవిస్తున్నవారిని కలవరపరుస్తోంది.
ట్రాఫిక్ చలానాలను నేరుగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డెబిట్ చేసే ప్రతిపాదనను తక్షణమే పునఃసమీక్షించి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ వినమ్రంగా సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ హృదయ పూర్వకంగా అభినందిస్తోంది.
రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు మావంతు సహకారం మేం కూడా అందిస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రతి సూచనను పాటిస్తున్నాం. ప్రమాద రహిత తెలంగాణ నిర్మాణానికి ఎల్లవేళలా సహకరిస్తామని మేం స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
ఆర్థిక సంక్షోభం ముప్పు
ట్రాఫిక్ చలానాల పేరుతో నేరుగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేసే ప్రతిపాదన అమలైతే రవాణారంగంలో పనిచేస్తున్న లక్షలాది స్వయం ఉపాధిదారులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, బస్సులు, కూరగాయల వ్యాపారం, చిన్నచిన్న వస్తువులను వాహనాలపై అమ్ముకుంటూ జీవిస్తున్నవారు ఇప్పటికే తక్కువ ఆదాయంతో కుటుంబ బాధ్యతలను నెరవేర్చలేక ఇబ్బంది పడుతున్నారు.
పెరిగిన ఖర్చులు, సిబిల్ స్కోర్ సమస్యలు, లోన్ల తిరస్కరణలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంక్‌లో జమచేసి ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు, వైద్య అవసరాలకు ఉపయోగించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో చిన్న చిన్న కారణాలతో వారిపై మరింత ఒత్తిడి పెంచడం సమంజసం కాదని ట్రాన్స్పోర్ట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క కిలోమీటర్ స్పీడు ఎక్కువగా ఉందని, లైన్ తప్పిందని చలాన్లు విధించడంతో మనస్తాపానికి గురవుతున్నారు.
రవాణారంగ కార్మికులకు అండగా నిలవాలి
పార్కింగ్ సదుపాయాలు లేకపోయినా ‘నో పార్కింగ్’ పేరుతో చెట్లు, పొదల మాటు నుంచి తీసిన ఫొటోల ఆధారంగా ఇష్టానుసారంగా చలానాలు వేయడం పరిపాటిగా మారింది. నేరుగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేస్తే చెక్కులు బౌన్స్ కావడం, సిబిల్ స్కోర్ పూర్తిగా దెబ్బతినడం, వ్యాపారాలు మూతపడటం తప్ప మరో మార్గం ఉండదు.
అత్యవసర వైద్య పరిస్థితుల్లో తల్లి, తండ్రి, భార్య లేదా పిల్లలను దవాఖానాకు తీసుకెళ్లినప్పుడు అకౌంట్‌లో ఉన్న రూ.వెయ్యి లేదా రూ. 2 వేలు కూడా చలాన్ పేరుతో కట్ అయితే ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రభుత్వం ఆలోచించాలి. స్వయం ఉపాధి ద్వారా బతుకుతూ, ఇతరులకు ఉపాధి కల్పిస్తూ, ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్న రవాణా రంగంపై ఇలాంటి ప్రతిపాదనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
సీఎంకు విజ్ఞప్తి
రవాణా రంగాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో, ఇలాంటి ప్రతిపాదనలు మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అందువల్ల సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రతిపాదనను సహృదయంతో వెంటనే వెనక్కి తీసుకుని, స్వయం ఉపాధి పొందుతున్న రవాణా రంగ కార్మికులకు అండగా నిలవాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ వినమ్రంగా కోరుతోంది.
రవాణా రంగంలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రమాదరహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి
మేం ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియజేస్తున్నాం.
- మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్-
