భక్తిరస చిత్రాలకు వెండితెరపై ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. లేటెస్ట్ గా పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా మహిమలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రం ‘అనంత’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 13 (మంగళవారం) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో నేరుగా విడుదలైంది. భక్తుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
దిగ్గజ దర్శకుడి భక్తి ప్రయాణం
రజనీకాంత్‌తో ‘బాషా’, ‘అన్నామలై’ వంటి మాస్ క్లాసిక్ చిత్రాలను రూపొందించిన లెజెండరీ డైరెక్టర్ సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన, ఒక సున్నితమైన భక్తిరస చిత్రాన్ని అంతే ప్రభావితంగా మలిచారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను గిరీష్ కృష్ణమూర్తి తెరకెక్కించారు.
ఇది జీవిత చరిత్ర కాదు.. నమ్మకానికి నిదర్శనం!
"ఇది సాయిబాబా జీవిత చరిత్ర (Biopic) కాదు. ఆయన చేసిన మహిమలు, బాబాను సంపూర్ణంగా నమ్మిన భక్తులకు కలిగిన అనుభవాల సమాహారం. 'పూర్తి విశ్వాసంతో బాబాను శరణువేడితే ఫలితం ఎలా ఉంటుంది?' అనే పాయింట్‌ను ఇందులో చూపించాం" అని దర్శకుడు సురేష్ కృష్ణ తెలిపారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటులు జగపతిబాబు, సుహాసిని తమ నటనతో ప్రాణం పోశారు. వీరితో పాటు వైజీ. మహేంద్రన్, నిగల్‌గళ్ రవి, తలైవాసల్ విజయ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో మెరిశారు. ఒకప్పటి మ్యూజిక్ సెన్సేషన్ దేవా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ గా నిలిచింది. గీత రచయిత స్నేహన్ అందించిన పాటలు, మాటలు బాబా తత్వాన్ని అద్భుతంగా చాటిచెప్పాయి.
థియేటర్ల విన్నపం ఉన్నా ఓటీటీకే మొగ్గు!
సినిమా ప్రివ్యూ చూసిన పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని కోరారు. అయితే, ఓటీటీ సంస్థతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకోవడంతో 'జియో హాట్‌స్టార్'లో నేరుగా విడుదల చేసినట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉన్న ఈ క్లీన్ డివోషనల్ మూవీకి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అద్భుతమైన వ్యూయర్ షిప్ వస్తోంది. భక్తి మార్గంలో నడవాలనుకునే వారికి, బాబా మహిమలను తెలుసుకోవాలనుకునే వారికి 'అనంత' ఒక చక్కని అనుభూతిని మిగిలిస్తోంది.
