ఇండియాలో వెయ్యి కోట్ల సైబర్ స్కాం : సంక్రాంతి రోజు బయటపడిన అతి పెద్ద మోసం

ఇండియాలో వెయ్యి కోట్ల సైబర్ స్కాం : సంక్రాంతి రోజు బయటపడిన అతి పెద్ద మోసం

బెంగళూరులో వచ్చిన సైబర్ కంప్లెయింట్.. దేశ చరిత్రలోనే అతిపెద్ద డిజిటల్ స్కామ్‌లలో ఒకటిగా బయటపడింది. సుమారు వెయ్యి కోట్లకు పైగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన ఒక భారీ ముఠా గుట్టును బెంగళూరు హుళిమావు పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేయడమే కాక.. దాదాపు 4వేల 500 బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.240 కోట్లను ఫ్రీజ్ చేశారు.

కుట్రకు కేంద్రం.. ముంబై టు దుబాయ్
ఈ మొత్తం నెట్‌వర్క్‌కు మాస్టర్‌మైండ్ 55 ఏళ్ల ప్రేమ్ తనేజా. ముంబైకి చెందిన ఇతను గతంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితుడు. ప్రస్తుతం ఇతను దుబాయ్‌లో ఉంటూ ఈ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. ఢిల్లీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆఫీసు పెట్టి, అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బాధితులకు గాలం వేసేవారు. 'Swamiji.com' , 'Neo System App' వంటి అప్లికేషన్ల ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో అమాయకులకు గ్యాలం వేసేవాడు.

డ్రాపౌట్ విద్యార్థి.. నెలకు ₹35 లక్షల సంపాదన..
ఈ కేసులో అరెస్ట్ అయిన 22 ఏళ్ల మొహమ్మద్ హుజైఫా కథ సినిమాను తలపిస్తుంది. చదువు మధ్యలోనే మానేసిన హుజైఫాకు ఆన్‌లైన్ గేమింగ్, టెక్నాలజీపై అపారమైన పట్టు ఉంది. గతంలో ప్రేమ్ తనేజాకు చెందిన యాప్‌ను ఇతను రెండుసార్లు హ్యాక్ చేశాడు. అతని టాలెంట్ చూసి ఆశ్చర్యపోయిన తనేజా.. తనపై కేసు పెట్టకుండా తన వద్దే పనికి కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి హుజైఫా 'మ్యూల్ అకౌంట్స్' ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతను ప్రతి 15 రోజులకు ఒకసారి దుబాయ్ వెళ్లి.. కొల్లగొట్టిన సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చేవాడు. ఇందుకు గాను అతనికి నెలకు రూ.30 నుంచి రూ.35 లక్షల వరకు కమిషన్ వచ్చేది.

కూలీల పేరుతో వేల ఖాతాలు..
సైబర్ నేరగాళ్లు తమను పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు 'అద్దె అకౌంట్ల'ను వాడేవారు. హుజైఫా, అతని తల్లి షబానా కలిసి అమాయక కూలీలకు డబ్బులు ఆశచూపి.. వారి ఆధార్ కార్డులతో వేల సంఖ్యలో బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేసేవారు. ఈ అకౌంట్ల ద్వారానే మోసం చేసిన డబ్బును మళ్లించేవారు. హుజైఫా ఒక్కడే దాదాపు 7వేల 500 అకౌంట్లను స్కామర్లకు అందించినట్లు పోలీసులు గుర్తించారు.

శాటిలైట్ ఫోన్లు.. దొరకని ఆధారాలు
పోలీసుల కళ్లుగప్పేందుకు ఈ ముఠా ఏకంగా శాటిలైట్ ఫోన్లను వాడేవారు. దుబాయ్‌లో ఉన్న తనేజాతో మాట్లాడేందుకు వీటిని ఉపయోగించేవారు. వీటి ద్వారా చేసే కాల్స్‌ను ట్రేస్ చేయడం సాధ్యం కాదు. కాల్ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోయేది. దీంతో వాళ్ల వ్యాపారం గురించి బయటకు పొక్కకుండా జాగ్రత్తపడేవారు. 

అయితే ఒక చిన్న కంప్లెయింట్ స్టోరీ మెుత్తాన్ని మార్చేసింది. అక్షయ నగర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మెగా స్కామ్ బయటపడింది. 'నియో సిస్టమ్' యాప్‌లో పెట్టుబడి పెడితే రూ.3.03 కోట్లు లాభం వచ్చిందని అతనికి టెలిగ్రామ్‌లో మెసేజ్ వచ్చింది. అయితే ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరికొంత కట్టాలని కోరడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డీసీపీ ఎం.నారాయణ నేతృత్వంలోని స్పెషల్ టీమ్ టెక్నికల్ ఆధారాల ద్వారా దర్యాప్తు చేసి.. నిందితులను ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, జార్ఖండ్ ప్రాంతాల్లో పట్టుకుంది. నిందితుల వద్ద నుంచి కోటి క్యాష్, అర కిలో బంగారం, 58 మొబైల్ ఫోన్లు, 7 ల్యాప్‌టాప్‌లు అలాగే శాటిలైట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తీగ లాగితే డొంకంతా కదలటం అంటే ఇదేనేమో అనిపిస్తోంది క్రైమ్ స్టోరీ చూస్తోంటే.