- ఇప్పటివరకు యూనిఫాం మాత్రమే పంపిణీ
- త్వరలో కేంద్రానికి ప్రపోజల్స్
- జూన్12లోపే అందించాలని సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురుకుల స్కూళ్ల స్టూడెంట్లకు ఇస్తున్నట్టుగా ప్రభుత్వ బడుల విద్యార్థులకు కూడా కిట్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 22 రకాల వస్తువులను ఉచితంగా అందజేస్తోంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు కూడా వీటిలో కొన్ని వస్తువులతో ‘స్టూడెంట్ కిట్’లను అందించాలని సర్కారు యోచిస్తోంది.
ఈ కిట్ లకు ప్రత్యేకంగా పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం రెండు మూడు పేర్లను పరిశీలిస్తున్నట్లుగా అధికార వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం గురుకుల స్టూడెంట్లకు22 వస్తువులను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండగా.. ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్లకు కేవలం యూనిఫాం ఒకటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో అందిస్తున్నారు. ఇకపై తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వీలుగా స్టూడెంట్ కిట్లను రూపొందిస్తున్నారు.
గురుకుల స్టూడెంట్లకు 22 వస్తువులు
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు 3 జతల యూనిఫాం, టై, బెల్ట్, జత షూస్, 2 జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, డిక్షనరీ, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్‌నర్, జామెట్రీ బాక్స్, వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ (ప్లేట్ & గ్లాస్), టవల్ ఇస్తున్నారు. అలాగే బెడ్ షీట్, దుప్పటి, ట్రంక్ బాక్స్, ట్రాక్ సూట్ అందచేస్తున్నారు. వీటిలో కొన్నింటిని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లకు కూడా అందచేయనున్నారు.
కేంద్రానికి ప్రపోజల్స్
సమగ్ర శిక్ష అభియాన్ లో భాగంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 60:40 రేషియోలో విద్యా శాఖకు నిధులు భరిస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వాళ్లకు ఇపుడు కేవలం స్కూల్ యూనిఫాంతో పాటు నోట్ బుక్స్, స్టడీ మెటిరియల్, టెక్స్ట్ బుక్స్, స్పోర్ట్స్ మెటిరియల్ ఇస్తున్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, సొసైటీ గురుకులాల్లో ఉండే హాస్టళ్ల స్టూడెంట్లకు 22 వస్తువులు ఇస్తున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో 17 లక్షల మంది స్టూడెంట్లు చదువుతుండగా, కేజీబీవీ, మోడల్, సొసైటీ గురుకులాలు కలిపి మొత్తం 21 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇపుడు గురుకుల స్టూడెంట్లకు ఇచ్చే 22 వస్తువులలో కొన్నింటిని ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్లకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకు ఖరారు చేసి సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఒకవేళ కేంద్రం అంగీకరించకపోతే షూస్, స్కూల్ బ్యాగ్ లు రాష్ర్ట ప్రభుత్వ నిధులతో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో పాఠశాలలు ప్రారంభమైన చాలా రోజుల వరకు యూనిఫాంలు, పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బంది పడేవారని ఇపుడు ఆ పరిస్థితి ఉండొద్దని విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూన్12 కల్లా అన్ని జిల్లాలకు కిట్లు చేరాలని ఆయన స్పష్టం చేశారు.
