తప్పు ఒప్పుకొమ్మని సినిమాల్లో అమాయకులను కొట్టడం చూస్తుంటాం. చేయని నేరాన్ని అంగీకరించే దాక థర్డ్ డిగ్రీ కూడా అప్లై చేసి ఒప్పించడం చూస్తుంటాం. జైభీమ్ సినిమాలో వచ్చిన అలాంటి ఘటనే బీహార్ లో జరిగింది. నేరాన్ని అంగీకరించాలని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడంతో పాటు.. ప్రైవేట్ పార్ట్స్ పై పెట్రోల్ పోయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్లో సమస్తిపూర్ లోని ఒక జువెలరీ షాపులో 60 గ్రాముల బంగారం పోయింది. అందులో పనిచేసే వారే దొంగిలించారని ముగ్గురిని అరెస్టు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నాలుగు రోజుల పోలీస్ కస్టడీ తర్వాత విడిచిపెట్టారు.
ఇంటికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటం, అతడు క్రిటికల్ కండిషన్ లో ఉండటంతో ఈ వ్యవహారం బయటపడింది.
పోలీసులు అరెస్టు చేయకముందే షాపు ఓనర్ ముగ్గురిని దారుణంగా కొట్టాడు. ముగ్గురిని బిల్డింగ్ పై నుంచి తోసేయనున్నట్లు బెదిరించారు. ఆ తర్వాత డిసెంబర్ 31న ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
పోలీస్ కస్టడీలో ముగ్గురినీ తప్పు ఒపప్పుకొమ్మని కొట్టినప్పటికీ.. ఒక వ్యక్తిని మాత్రం దారుణంగా హింసించారు. అతడి ప్రైవేట్ పార్ట్స్ పై పెట్రోల్ పోసి దారుణానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమిస్తుండటంతో బాండ్ మీద విడిచిపెట్టారు. అంతేకాకుండా వారిని విడిచేందుకు పోలీసులు లంచం డిమాండ్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బాధితుడి తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. తన కొడుకును టార్గెట్ చేశారని.. తప్పు ఒప్పుకొమ్మని దారుణంగా హింసించారని చెప్పారు. తేజ్ పూర్ పోలీస్ స్టేషన్ లో మూడు రోజులు చిత్ర హింసలకు గురిచేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని విడిచి పెట్టేందుకు 50 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు చెప్పారు.
అదే సమయంలో అతని ఇంట్లో కూడా ఆభరణాలకోసం వెతికారని.. కానీ ఎక్కడా దొరకపోవడంతో.. దొంగిలించినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు.
బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్పీ అర్వింద్ ప్రతాప్ సింగ్ ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. స్టేషన్ ఇంఛార్జిని కూడా సస్పెండ్ చేశారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సస్పెండ్ అయిన వారిలో స్టేషన్ ఇంఛార్జీ శంకర్ శరన్ దాస్, రాజ్వంశ్ కుమార్, రాహుల్ కుమార్ లు ఉన్నారు.
