ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2026కు నెల రోజుల కంటే తక్కువగా సమయం ఉంది. ఈ సమయంలో పాక్ సంతతి క్రికెటర్లకు వీసా సమస్య కొనసాగుతోంది. ఇటీవలే USA అలీ ఖాన్ కు వీసా తిరస్కరించబడింది. పాకిస్థాన్ సంతతి క్రికెటర్ కావడమే ఇందుకు కారణమని స్పష్టంగా అర్ధమవుతోంది. తాజాగా ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఈ లిస్ట్ లో చేరారు. వరల్డ్ కప్ కు ఎంపికైన ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్ లకు భారత ప్రభుత్వం నుండి ఇంకా వీసాలు రాలేదని సమాచారం. వీరిద్దరూ పాకిస్థాన్ సంతతి క్రికెటర్లు కావడమే గమనార్హం.
టీ20 ప్రపంచ కప్ కోసం ఇండియాకు వెళ్లడానికి రషీద్, అహ్మద్ లకు భారత ప్రభుత్వం నుండి వీసాలు ఇంకా రాలేదు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇద్దరు ఆటగాళ్లకు అవసరమైన పత్రాలు లభిస్తాయని నమ్మకంగా ఉందని.. వారి దరఖాస్తులకు ఎటువంటి అభ్యంతరాలు లేవని హామీ ఇస్తున్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి UK ప్రభుత్వం నుండి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సహాయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ఆటగాళ్ల దరఖాస్తులకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని భారత ప్రభుత్వం నుండి ECB హామీ పొందిందని, అయితే సమయం అనిశ్చితంగా ఉన్నట్టు సమాచారం.
వీసా ఆలస్యం కారణంగా రషీద్, రెహన్ అహ్మద్ టీ20 వరల్డ్ కప్ ముందు జరగబోయే శ్రీలంక సిరీస్ కు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అయితే టీ20 ప్రపంచ కప్ సమయానికి ఈ ఇద్దరు ఆటగాళ్లకు వీసాలు జారీ చేయబడతాయని ECB నమ్మకంగా ఉంది. జనవరి 22 నుండి ఫిబ్రవరి 3 వరకు శ్రీలంకతో ఇంగ్లాండ్స్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రషీద్ ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. మరోవైపు రెహాన్ బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026 ముందు యుఎస్ఎ ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ కు ఇదే సమస్య వచ్చి పడింది. ఈ USA పేసర్ కు వీసా తిరస్కరించబడింది.
