బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఎప్పుడూ తన మనసులో ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా మాట్లాడటానికి వెనుకాడదు. ఇటీవల ఆమె నటించిన 'సాలె మొహబ్బత్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో మంచి జోష్‌లో ఉంది . లేటెస్ట్ గా ఈ భామ తన వ్యక్తిగత జీవితం , సినీ పరిశ్రమలోని పని సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఆ పన్నెండు గంటల రూల్!
సినీ పరిశ్రమలో పని గంటల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది రాధికా ఆప్టే . తనకంటూ కొన్ని కఠినమైన నిబంధనలను విధించుకున్నానని తెలిపింది. నేను ఒక షిఫ్ట్‌లో 12 గంటల కంటే ఎక్కువ పని చేయను. ఈ 12 గంటల్లోనే మేకప్, హెయిర్, ప్రయాణం, షూటింగ్ అన్నీ ఉండాలి. నేను లొకేషన్‌కు చేరుకోవడానికి రెండు గంటలు పడితే, ఆ సమయాన్ని కూడా పని గంటలుగానే పరిగణిస్తాను. అంటే షూటింగ్ సమయాన్ని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాను అని స్పష్టం చేశారు.
మాతృత్వం తర్వాత మారిన దృక్పథం
బిడ్డ పుట్టిన తర్వాత తన ప్రాధాన్యతలు పూర్తిగా మారాయని ఆమె పేర్కొన్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో , బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సెట్స్‌పై గంటల తరబడి వేచి ఉండటం ఎంతో శ్రమతో కూడుకున్న పని అని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే, ఇప్పుడు తన హద్దులను స్పష్టంగా గీసుకున్నట్లు తెలిపారు. వారానికి ఒక సెలవు ఖచ్చితంగా ఉండాలని నేను పట్టుబడతాను. వీలైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయడానికి మొగ్గు చూపుతాను అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది..
మద్దతు కరువు.. కానీ తగ్గేదేలే!
ఇలాంటి నిబంధనలు పెట్టడం ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చడం లేదని రాధికా ఆవేదన వ్యక్తం చేశారు. నేను నా పరిమితుల గురించి మాట్లాడితే కొందరికి కోపం వస్తుంది. మరికొందరు దీన్ని అహంకారంగా భావిస్తారు. కానీ నా ఆరోగ్యం, నా కుటుంబం నాకు ముఖ్యం. చిన్న సినిమాలకు నేను కొంత వెసులుబాటు ఇస్తాను కానీ, నా నియమాలను పాటించే విషయంలో రాజీ పడను. దురదృష్టవశాత్తూ మన పరిశ్రమలో ఈ తరహా పని సంస్కృతికి తక్కువ మద్దతు లభిస్తోంది అని ఆమె చెప్పుకొచ్చారు..
రాధికా ఆప్టే మాటలు సినీ కార్మికులు, నటీనటుల పని గంటల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చాయి. కేవలం డబ్బు కోసమే కాకుండా, మనశ్శాంతి కోసం పని చేయాలనే ఆమె సిద్ధాంతం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది...
