సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేల జోరు తెలంగాణలోనూ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో జాతరను తలపించేలా పందేలు జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు. కుమ్రంబీమ్ జిల్లాలో కోడి పందాలు యుద్ధ వాతావరణంలో జరుగుతున్నాయి.
పండుగ వేళ మధ్యాహ్నం తర్వాత జిల్లాలో పోటీలు ప్రారంభించారు ఔత్సాహికులు. బెజ్జూర్ మండలం తలాయిలో జోరుగా పందేల్లో పాల్గొన్నారు పందెం రాయుళ్లు. చుట్టు పక్కల గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని వేలల్లో పందేలు కాస్తున్నారు. పోటీలు చూడటానికి యువకులు భారీగా తరలివచ్చారు.
మరోవైపు అటు ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కోడి పందేల జోరు కొనసాగుతోంది. మామిడి తోటలు, పామాయిల్ తోటలు పందెం వేదికలుగా మారిపోయాయి. రాత్రి వేళల్లో కూడా పందాలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్లు, జనరేటర్లు సిద్ధం చేశారు. వేల నుంచి లక్ష రూపాయల్లో బెట్టింగ్ లు పెడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
