టీమిండియాతో మ్యాచ్ అంటే కొంతమంది క్రికెటర్లకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. ఈ లిస్ట్ లో నిన్నటివరకు ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. హెడ్ మనకు అతిపెద్ద తలనొప్పి. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్.. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిల్స్ ను దూరం చేశాడు. భారత్ ఆతిథ్యమిచ్చిన 2023 వన్డే ప్రపంచ కప్.. భారత్‌తో జరిగిన ఫైనల్లో హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. అతని శతకంతో సొంతగడ్డపై రోహిత్ శర్మ అండ్ కో ప్రపంచకప్ ట్రోఫీని చేజార్చుకుంది.
ఇక రెండోవది.. అదే ఏడాది జూన్ లో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అతడే అడ్డుపడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఏకంగా 163 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. హెడ్ తో పాటు ఇప్పుడు భారత జట్టుకు మరో ప్లేయర్ తలనొప్పిగా మారాడు. అతడే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్.
హెడ్ బాటలోనే మిచెల్:
న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. భారత జట్టు అంటే అదే ఆపనిగా చెలరేగిపోతున్నారు. ఇండియాపై ఇండియాలో మిచెల్ రికార్డ్ వావ్ అనేలా ఉంది. ఇండియాలో మిచెల్ చివరిసారిగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా మూడు సెంచరీలు బాదేశాడు. ఇండియాలో ఈ కివీస్ వీరుడు వరుసగా 130, 134,84, 131 పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ ల్లో 159 యావరేజ్ తో 479 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న సిరీస్ లో మిచెల్ తొలి వన్డేలో 84.. రెండో వన్డేలో 131 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
వన్డేలో నెంబర్ వన్ ర్యాంక్ కు చేరువలో:
ఐసీసీ బుధవారం (జనవరి 14) ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ సహచరుడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అయితే రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కోహ్లీ కంటే కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే వెనకపడి ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ 785 రేటింగ్ పాయింట్స్ తో కోహ్లీ టాప్ లో ఉండగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
బుధవారం (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో కోహ్లీ విఫలం కాగా.. మరోవైపు మిచెల్ సెంచరీతో సత్తా చాటాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. కివీస్ స్టార్ మిచెల్ మాత్రం ఏకంగా 131 పరుగులతో చెలరేగాడు. ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలోనే కోహ్లీ తన టాప్ ర్యాంక్ మిచెల్ కు కోల్పోయే ప్రమాదముంది.
