Shambhala OTT Release: ఓటీటీలోకి ఆది'శంబాల'.. మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ చూడాలంటే?

 Shambhala OTT Release: ఓటీటీలోకి ఆది'శంబాల'..  మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ చూడాలంటే?

టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్‌ నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘శంబాల’ .  క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్  వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి 2025 ముగింపు అద్భుతమైన విజయాన్ని అందించింది. . థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించిన ఈ మిస్టరీ థ్రిల్లర్, ఇప్పుడు డిజిటల్ తెరపై అలరించేందుకు సిద్ధమైంది.

ఓటీటీలో ‘శంబాల’ సందడి

ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ (aha) దక్కించుకుంది.  జనవరి 22 నుంచి ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.. థియేటర్లలో ఈ మిస్టీరియస్ థ్రిల్లర్‌ను మిస్ అయిన వారికి ఇదొక గొప్ప అవకాశం. కాగా, ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ దృష్ట్యా జనవరి 9న హిందీలో కూడా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు.

 

కథా నేపథ్యం:

 
ఈ సినిమా కథ 1980ల కాలంలో సాగుతుంది. 'శంబాల' అనే ప్రశాంతమైన గ్రామంలో ఆకాశం నుంచి ఒక వింత ఉల్క పడటంతో కథ మలుపు తిరుగుతుంది. అదే రోజు ఆ ఊరి రైతు రాములు (రవి వర్మ) ఆవు నుంచి పాలు కాకుండా రక్తం రావడంతో గ్రామస్తులు వణికిపోతారు. ఆ ఉల్కను ‘బండ భూతం’ అని పిలుస్తూ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు.

ఈ మిస్టరీని ఛేదించడానికి ఢిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్ (ఆది సాయికుమార్) శంబాలకు వస్తాడు. సైన్స్‌ను తప్ప దేన్నీ నమ్మని విక్రమ్, ఆ గ్రామంలో జరుగుతున్న వింత హత్యలను ఎలా ఎదుర్కొన్నాడు? ఉల్కకు, గ్రామ దేవత చరిత్రకు ఉన్న సంబంధం ఏంటి? విక్రమ్‌కు సహాయపడిన దేవి (అర్చన అయ్యర్) ఎవరు? చావులోనూ సైన్స్ వెతికే విక్రమ్, ఆ మర్మమైన శక్తులను ఎలా జయించాడు? అనేదే ఈ చిత్ర ఉత్కంఠభరిత కథనం.

 థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్!


దర్శకుడు యుగంధర్ ముని ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. గ్రామీణ సెంటిమెంట్లను, ఖగోళ శాస్త్రం (Astronomy) తో ముడిపెట్టిన తీరు అద్భుతం.  శాస్త్రవేత్త విక్రమ్ పాత్రలో ఆది అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత వైవిధ్యమైన పాత్ర అని చెప్పవచ్చు. 1980ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సినిమాటోగ్రఫీ, ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి. మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రంలో నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ‘శంబాల’, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు సస్పెన్స్, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారైతే, జనవరి 22న ఆహాలో ఈ ‘శంబాల’ రహస్యాన్ని చూడొచ్చు మరి..