అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్ లో పసికూన యూఎస్ఏ పై ఘన విజయం సాధించింది. గురువారం (జనవరి 15) బులవాయో వేదికగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా టార్గెట్ ను 37 ఓవర్లలో 96 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని ఇండియా 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసి గెలిచింది.
స్వల్ప ఛేజింగ్ లో తడబాటు:
స్వల్ప ఛేజింగ్ లో బరిలోకి దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. టాప్ ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ కేవలం 2 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులకు కుదించారు. గంట పాటు బ్రేక్ తీసుకున్న తర్వాత ఇండియా వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. వేదాంత్ త్రివేది (2), ఆయుష్ మాత్రే (19) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ దశలో అభిజ్ఞాన్ కుండు, విహాన్ మల్హోత్రా కీలక భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చారు. విహాన్ మల్హోత్రా (18) ఔటైనా కుండు (42*) చివరి వరకు క్రీజ్ లో ఉండి ఇండియాకు విన్నింగ్ రన్స్ కొట్టాడు.
బ్యాటింగ్ లో USA చిత్తు చిత్తు:
మొదట బ్యాటింగ్ కు దిగిన యూఎస్ఏకు మంచి ఆరంభం లభించలేదు. అమరీందర్ గిల్ ను హెనిల్ పటేల్ కేవలం ఒక పరుగు వద్ద ఔట్ చేశాడు. ఈ దశలో సాహిల్ గార్గ్ (16), అర్జున్ మహేష్ (16) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పరుగుల వేగం బాగా మందగించింది. రెండో వికెట్ కు 28 పరుగులు జోడించిన తరువాత ఈ జోడీని దీపేష్ దేవేంద్రన్ విడగొట్టాడు. దీంతో 29 పరుగుల వద్ద యూఎస్ఏ తమ రెండో వికెట్ కోల్పోయింది. ఇక్కడ నుంచి యూఎస్ఏ వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకుంది. ఉత్కర్ష్ శ్రీవాస్తవ (0), అర్జున్ మహేష్ (16), అమోఘ్ అరేపల్లి (3) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు.
ఒక దశలో వికెట్ నష్టానికి 29 పరుగులతో పర్వాలేదనిపించిన యూఎస్ఏ కాసేపటికే 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అద్నిత్ జాంబ్, నితీష్ సుడిని కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. ఆరో వికెట్ కు 30 పరుగులు జోడించి జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీ బ్రేక్ కావడంతో యూఎస్ఏ ఇన్నింగ్స్ త్వరగానే ముగింది. మిడిల్ ఓవర్స్ లో హెనిల్ పటేల్ విజృంభించడంతో ప్రత్యర్థి జట్టు కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 5 వికెట్లు పడగొట్టాడు. దీపేష్ దేవేంద్రన్, ఆర్.ఎస్. అంబ్రిష్, ఖిలాన్ పటేల్,వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ పడగొట్టారు.
