Mustafizur Rahman: వరల్డ్ కప్ ఇండియాలో ఆడేది లేదు.. ముస్తాఫిజుర్‌ను తప్పించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అసహనం

Mustafizur Rahman: వరల్డ్ కప్ ఇండియాలో ఆడేది లేదు.. ముస్తాఫిజుర్‌ను తప్పించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అసహనం

ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ తప్పించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌‌‌‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వేలంలో ముస్తాఫిజుర్‌‌‌‌ను రూ. 9.20 కోట్లకు నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ దక్కించుకుంది. అయితే ప్రస్తుతం బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అతన్ని ఐపీఎల్‌‌‌‌ నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. ముస్తాఫిజుర్‌‌‌‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ.. నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ను కోరింది. దాని ప్రకారమే అతన్ని రిలీజ్‌‌‌‌ చేశారు. ఇదిలా ఉంటే ముస్తాఫిజుర్ ను తప్పించడం పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం అసహనంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.      

ముస్తాఫిజుర్ ను కేకేఆర్ రిలీజ్ చేసిన వెంటనే.. భారత్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి)ను ఆదేశించినట్టు సమాచారం. జై షా నేతృత్వంలోని ఐసీసీతో ఈ విషయాన్ని చర్చించి ఇండియాలో జరగనున్న బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్ లకు వేదిక మార్పు కోరాలని బీసీబీని కోరినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. "క్రీడా మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించే సలహాదారుగా నేను క్రికెట్ కంట్రోల్ బోర్డును మొత్తం విషయాన్ని లిఖితపూర్వకంగా అందించి ఐసీసీకి వివరించాలని ఆదేశించాను". అని నజ్రుల్ ఫేస్‌బుక్‌లో బెంగాలీలో రాశారు.

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ లను శ్రీలంకలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై అటు ఐసీసీ.. ఇటు బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తాజా పరిణామాల నేపథ్యంలో పాక్ మాదిరిగా బంగ్లాతో ఇండియా క్రికెట్ సంబంధాలు దెబ్బతినే చాన్సుంది. సెప్టెంబర్​లో  టీమిండియా.. బంగ్లా టూర్‌‌‌‌ను బీసీసీఐ హోల్డ్‌‌లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరిలో టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో బంగ్లా ఆడే మ్యాచ్‌‌‌‌లన్నీ ఇండియాలోనే జరగనున్నాయి. వాటిని శ్రీలంకకు మార్చాలని బంగ్లా బోర్డు డిమాండ్ చేసే చాన్స్ ఉంది.