బంగ్లాదేశ్..పెద్ద టీమ్ లను వణికించింది

బంగ్లాదేశ్..పెద్ద టీమ్ లను వణికించింది

అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌లోకి అతి సామాన్య జట్టుగా వచ్చిన బంగ్లాదేశ్‌‌‌‌.. ఆ తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. చూడటానికి చిన్న జట్టేగానీ మైదానంలో గొప్పగా ఆడిన సందర్భాలకు తక్కువేమీ లేవు. తమదైన రోజున పెద్ద టీమ్‌‌‌‌లను సైతం వణికించి తిరుగులేని విజయాలతో క్రికెట్‌‌‌‌ ప్రపంచంలో తమకంటూ ఓ చరిత్రను లిఖించుకున్నది. అలాంటి బంగ్లా టైగర్లు ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌పైన దృష్టి సారించారు. టైటిల్‌‌‌‌ రేసులో లేకపోయినా.. ఏదో  ఓ రోజు పెద్ద జట్లకు షాకిచ్చే బంగ్లా నుంచి ఇతర టీమ్‌‌‌‌లకు ముప్పు తప్పకపోవచ్చు. గత కొంతకాలంగా నిలకడగా ఆడుతున్న బంగ్లా.. 2013 చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో సెమీస్‌‌‌‌కు చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు 2015 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ఫైనల్‌‌‌‌ చేరిన రికార్డును కూడా మెరుగుపర్చుకోవాలని టార్గెట్‌‌‌‌ పెట్టుకుంది. షకీబ్‌‌‌‌, ముష్ఫికర్‌‌‌‌, మోర్తజా, మోహిది హసన్‌‌‌‌, తమీమ్‌‌‌‌ వంటి ఆటగాళ్లతో జట్టు కూడా సమతూకంగా కనిపిస్తున్నది. ఇటీవల ముక్కోణపు సిరీస్‌‌‌‌లో విండీస్‌‌‌‌పై గెలిచి మంచి టచ్‌‌‌‌లోకి కూడా వచ్చింది. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌ బంగ్లాకు ప్రతికూలమే అయినా.. లీగ్‌‌‌‌ దశలో సంచలనాలను మాత్రం ఊహించొచ్చు. ఓవరాల్‌‌‌‌గా అనుభవం, కుర్రాళ్లతో బరిలోకి దిగుతున్న బంగ్లాతో బహు పరాక్‌‌‌‌గా ఉండాల్సిందే..!

అనుభవమే బలం..

మైదానంలో ఎప్పుడు ఎలా చెలరేగుతుందో అంచనా వేయలేని బంగ్లాదేశ్‌‌‌‌కు అనుభవమే పెద్ద బలం. జట్టులో ఐదుగురు ప్లేయర్లకు 150కి పైగా వన్డేలు ఆడిన అనుభవం ఉంది. ప్రస్తుతం వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో బరిలోకి దిగుతున్న ఏ జట్టులోనూ ఇంతమంది అనుభవజ్ఞులు లేరు. కెప్టెన్‌‌‌‌ మష్రాఫి మోర్తజా, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ షకీబల్‌‌‌‌ హసన్‌‌‌‌, మహ్మదుల్లా, ముష్ఫికర్‌‌‌‌ రహీమ్‌‌‌‌.. 2007 ప్రపంచకప్‌‌‌‌ నుంచి బంగ్లా జట్టుకు సేవలందిస్తున్నారు. ఇక ఓపెనింగ్‌‌‌‌లో విధ్వంసకర బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ తమీమ్‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌ను తక్కువగా అంచనా వేయలేం. మెరుపు ఆరంభాన్నివ్వడంలోనూ, పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో భారీ సిక్సర్లు కొట్టగల సమర్థుడు. ఇంగ్లండ్‌‌‌‌లోని చిన్న గ్రౌండ్స్‌‌‌‌ ఇతని హిట్టింగ్‌‌‌‌కు అతికినట్లు సరిపోతాయి. ప్రపంచస్థాయి ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా షకీబ్‌‌‌‌.. తన బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌తో జట్టుకు సమతూకంగా తీసుకొస్తాడు. నాలుగో ప్రపంచకప్‌‌‌‌ ఆడుతున్న ముష్ఫికర్‌‌‌‌.. బంగ్లాకు అతిపెద్ద బలం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒంటరిగా పోరాటం చేసి గట్టెక్కించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది కూడా. టాప్‌‌‌‌–6 వరకు లైనప్‌‌‌‌ బాగానే ఉన్నా.. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో పరుగులు రాబట్టే ఆటగాడు లేడు. ఓవరాల్‌‌‌‌గా అనుభవం, కుర్రాళ్లకు సమప్రాధాన్యంతో బరిలోకి దిగుతున్న బంగ్లా ఈ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో రికార్డును సవరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015లో క్వార్టర్స్‌‌‌‌లో ఓడిన బంగ్లా.. అంతకుముందు టోర్నీల్లో పెద్దగా రాణించలేదు.

 బౌలింగ్‌‌‌‌ బలహీనత..

బ్యాటింగ్‌‌‌‌లో బలంగా కనిపిస్తున్న బంగ్లాకు బౌలింగ్‌‌‌‌ పెద్ద బలహీనత. ఫ్లాట్‌‌‌‌ వికెట్లపై సత్తా చాటే అనుభవం ఉన్న బౌలర్లు లేరు. ఉపఖండంలో ఆడేటప్పుడు ఎక్కువగా స్పిన్‌‌‌‌పై ఆధారపడుతుంది. కానీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌‌‌‌ను ఏలుతున్న మణికట్టు స్పిన్నర్ల స్థాయిని అందుకునే నాణ్యమైన టర్నర్‌‌‌‌ లేకపోవడం ప్రతికూలాంశం. షకీబ్‌‌‌‌లాంటి సీనియర్‌‌‌‌ ఉన్నా.. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా అతనిపై అధిక ఒత్తిడి నెలకొని ఉంటుంది. పేస్‌‌‌‌కు స్వర్గధామమైన ఇంగ్లండ్‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌తో పనిలేకపోయినా.. మెహిది హసన్‌‌‌‌ ఏమేరకు రాణిస్తాడో చూడాలి. ఆసియా పిచ్‌‌‌‌లపై అతని రికార్డు బాగానే ఉన్నా.. ఇంగ్లిష్‌‌‌‌ వికెట్లపై మ్యాజిక్‌‌‌‌ పని చేస్తుందా? అన్నదే ప్రశ్న. ఇతర జట్లతో పోలిస్తే పేస్‌‌‌‌ అటాక్‌‌‌‌ కూడా అంత పటిష్టంగా కనిపించడం లేదు. ఇంగ్లండ్‌‌‌‌లో కాస్త తొందరగా బంతి రెండువైపులా స్వింగ్‌‌‌‌ అవుతుంది. దీనిని అందిపుచ్చుకునే బౌలర్‌‌‌‌ అందుబాటులో లేడు. ముస్తాఫిజుర్‌‌‌‌, అబు జాయేద్‌‌‌‌లాంటి ఇద్దరు స్టార్‌‌‌‌ పేసర్లు ఉన్నా… వీళ్లకు అక్కడ ఆడిన అనుభవం తక్కువ. అయినా ఇప్పుడు ముస్తాఫిజుర్‌‌‌‌పైనే ఎక్కువ భారం వేసింది బంగ్లా.  వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఐర్లాండ్‌‌‌‌, వెస్టిండీస్‌‌‌‌తో ట్రై సిరీస్‌‌‌‌ ఆడి టైటిల్‌‌‌‌ గెలిచింది. ఇది సానుకూలమే అయినా..  300ల పైచిలుకు స్కోరు ఎదురైతే బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ కుప్పకూలడం కూడా ఓ లోటుగా కొనసాగుతున్నది. అంటే ఒత్తిడిని అధిగమించే మానసిక ధృడత్వం ఇంకా అలవడలేదు.

జట్టు: మోర్తజా (కెప్టెన్‌‌), షకీబ్‌‌, లిట్టన్‌‌ దాస్‌‌, మెహిది హసన్‌‌, మొసద్దేక్‌‌ హుసేన్‌‌, రూబెల్‌‌ హుసేన్‌‌, తమీమ్‌‌ ఇక్బాల్‌‌, అబు జాయేద్‌‌, మహ్మదుల్లా, మహ్మద్‌‌ మిథున్‌‌, ముష్ఫికర్‌‌ రహీమ్‌‌, ముస్తాఫిజుర్‌‌ రెహమాన్‌‌, షబ్బీర్‌‌ రెహమాన్‌‌, మహ్మద్‌‌ సైఫుద్దీన్‌‌, సౌమ్య సర్కార్‌‌.

నాకౌట్‌‌ కష్టమే!…..

మామూలు టోర్నీలో సంచలనాలు చేసే బంగ్లాకు వరల్డ్‌‌కప్‌‌ ఫార్మాట్‌‌ ప్రతికూలంగా ఉంది. ఎందుకంటే లీగ్‌‌లో దశలో మిగతా 9 జట్లతో పోటీపడి గెలువడమంటే కత్తిమీద సామే. మెగా ఈవెంట్‌‌లో ప్రతి జట్టు ప్రమాదకరంగానే ఆడుతుంది. కాబట్టి శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌‌ వంటి జట్లపై విజయాలు ఊహించినా.. ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌‌, ఆసీస్‌‌లాంటి టీమ్‌‌లపై గెలువడమంటే శక్తికి మించి పోరాడాలి. కానీ క్రికెట్‌‌లో ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. తనదైన రోజున మేటి జట్లకు షాకిచ్చిన చరిత్ర ఉన్న బంగ్లా టైగర్స్‌‌ గర్జిస్తే.. మళ్లీ నాకౌట్‌‌ వరకు రావొచ్చు. లేదంటే తొమ్మిదో స్థానానికి పరిమితం కావాల్సిందే..!