ఢాకా: తమ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్లకూడదని బీసీబీ నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముస్తాఫిజుర్ అంశాన్ని మాట్లాడేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు శనివారం రాత్రి వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఇందులో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం మరోసారి సమావేశమైన బోర్డు సభ్యులు తమ వైఖరిని మార్చుకుని ఇండియాకు వెళ్లొద్దని నిర్ణయించారు. ‘గత 24 గంటల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇండియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఆడబోదు. ఇండియాలో పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత మా జట్టు భద్రతపై మాకు ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో మా ప్రభుత్వం నుంచి వచ్చిన సలహా మేరకు మేం అక్కడికి వెళ్లొద్దని నిర్ణయించాం’ అని బీసీబీ తన ప్రకటనలో పేర్కొంది.
లంకకు మార్చాలి..
షెడ్యూల్ ప్రకారం బంగ్లా లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్‌లు వెస్టిండీస్ (ఫిబ్రవరి 7), ఇటలీ (9), ఇంగ్లండ్ (4)తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది. 17న నేపాల్‌తో జరిగే మ్యాచ్‌కు ముంబై ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లన్నింటిని శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. పాక్‌తో ఉన్న ఒప్పందంలాగా తమ అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ‘ఐసీసీ ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాం. ఈ విషయంపై తక్షణ స్పందన కోసం మేం ఎదురుచూస్తున్నాం’ అని బీసీబీ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ ప్రకటనకు ముందే బంగ్లా జట్టు ఇండియాకు వెళ్లదని ఆ దేశ ప్రభుత్వ, క్రీడాశాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇండియా క్రికెట్ బోర్డు హింసాత్మక మతతత్వ విధానం నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బెంగాల్ వెర్షన్‌లో రాసుకొచ్చాడు. ‘మా మ్యాచ్‌లను లంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేయాలని మా బోర్డును ఆదేశించాను. ఒక బంగ్లా క్రికెటర్ ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు టీమ్ మొత్తం ఇండియాలో ఆడటం సురక్షితం కాదని మేం భావిస్తున్నాం. అన్ని వివరాలతో ఈ విషయాన్ని ఐసీసీకి లిఖిత పూర్వకంగా తెలియజేయాలి’ అని నజ్రుల్ పేర్కొన్నాడు. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ లీగ్ నుంచి తప్పించింది. దాంతో ఈ వివాదం రాజుకుంది. మరోవైపు టోర్నీకి ఒక నెల రోజు సమయమే మిగిలి ఉండటంతో.. మ్యాచ్‌లను తరలించడం దాదాపు అసాధ్యమని బీసీసీఐ వర్గాలు
వెల్లడించాయి.
బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలకు బ్రేక్!
తాజా పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిలిపి వేయాలని తమ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సలహాదారుడిని కోరినట్లు నజ్రుల్ చెప్పారు. ‘బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలు ఉండకూడదు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలని మేం మా ఐ అండ్ బి శాఖను కోరాం. బంగ్లా క్రికెట్, క్రికెటర్లకు, బంగ్లాదేశ్‌కు ఎలాంటి అవమానం జరగడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లో సహించం. బానిసత్వ రోజులు ముగిశాయి’ అని నజ్రుల్ పేర్కొన్నాడు.
లిటన్ దాస్‌కు కెప్టెన్సీ
బంగ్లా బోర్డు 15 మందితో కూడిన వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్సీ నిలబెట్టుకోగా, తస్కిన్ అహ్మద్ రీ ఎంట్రీ ఇచ్చాడు.
బంగ్లాదేశ్ జట్టు
లిటన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్, తంజిద్ హసన్, మహ్మద్ పర్వేజ్ హుస్సేన్ ఎమన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, నురుల్ హసన్, షాక్ మెహిదీ హసన్, రిషాద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, మహ్మద్ షైఫుద్దీన్, షోరిఫుల్ ఇస్లామ్.
