ఇన్​స్టంట్, రెడీ టు సర్వ్​ ఫుడ్ అమ్ముతున్న ఓ మహిళ ఫుడ్ జర్నీ

ఇన్​స్టంట్, రెడీ టు సర్వ్​ ఫుడ్ అమ్ముతున్న ఓ మహిళ ఫుడ్ జర్నీ

చిన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకుని వంట గదిలోకి వెళ్లి..  అమ్మ వండే రకరకాల వంటకాల్ని రుచి చూసేది. పెద్దయ్యాక అమ్మలా మంచి కుక్​ అవ్వాలనుకుంది. చదువు పూర్తయ్యాక కొన్నేండ్లు కార్పొరేట్ కంపెనీలో హెచ్.​ఆర్​గా పనిచేసింది. కానీ, ఫుడ్ లవర్​ అయిన ఆమె మనసులో ఫుడ్​ స్టార్టప్​ ఆలోచనలే తిరుగుతుండేవి.  తమ ప్రాంతంలోని వంటకాల గురించి వాళ్ల అమ్మ రాసిన బుక్ చదివాక ఆ ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యాయి. దాంతో అమ్మ జ్ఞాపకార్థం ‘ప్రమీలాస్​ కిచెన్​’ అనే ఫుడ్​ స్టార్టప్​ పెట్టింది బెంగళూరుకు చెందిన చిత్ర స్వామి. ఇన్​స్టంట్, రెడీ టు సర్వ్​ ఫుడ్ అమ్ముతున్న ఆమె ఫుడ్ జర్నీ ఇది...

ఆరు  నెలల కిందట ‘ప్రమీలాస్​ కిచెన్​’ని  మొదలుపెట్టింది చిత్ర తల్లి ప్రమీల స్వామి. ఆమె మంచి కుక్. నాటకాల్లోనూ నటించేది. రైటర్​ కూడా. చిన్నప్పుడు పుట్టింట్లో తాను రుచి చూసిన వంటకాల గురించి ‘ఉరెంబ ఉదర’ అనే పుస్తకం రాసిందామె. రెండేండ్ల కిందట ఆమె చనిపోయింది. దాంతో అమ్మ గుర్తుగా ఏం చేయాలని ఆలోచిస్తూ... ఉరెంబ ఉడర పుస్తకంలోని వంటకాల గురించి చదివింది చిత్ర. అప్పుడే తనకు అమ్మ పేరుతో  ఫుడ్​ బిజినెస్​ పెట్టాలనే  ఐడియా వచ్చింది. ఆ పుస్తకమే చిత్రను కార్పొరేట్ జాబ్​ వదిలేసి ఫుడ్ స్టార్టప్ వైపు అడుగులు వేసేలా చేసింది. ‘ఫుడ్​ మీద ఇష్టం ఉంది సరే.. అమ్మలాగ నేను రుచిగా వండగలనా?’ అనే సందేహం ఉండేది చిత్రకు. అందుకని కొన్ని ఇన్​స్టంట్ రెసిపీలు చేసి  ఇంట్లోవాళ్లు, ఇరుగుపొరుగు, ఫ్రెండ్స్​కి రుచి చూడమని ఇచ్చింది. వాళ్లు ‘బాగున్నాయి’ అని చెప్పడంతో ధైర్యంగా ముందుకెళ్లింది. కొత్త వంటకాల్ని ఇష్టపడేవాళ్లను టార్గెట్​గా పెట్టుకుంది. అంతేకాదు ‘ప్రమీలాస్​ కిచెన్​’ పేరుతో  యూట్యూబ్​ ఛానెల్​ పెట్టింది. అందులో  కిచెన్​ టిప్స్​తో పాటు కొత్త వంటకాల గురించిన వీడియోలుపెడుతుంది చిత్ర.  

మిల్లెట్స్​ దోసె పిండి...

‘ప్రమీలాస్​ కిచెన్​’లో... రాగి, కొబ్బరి, గుమ్మడి గింజలు, మిల్లెట్స్​తో చేసిన  దోసె పిండి, ఆరు రకాల ఇడ్లీ పిండ్లు దొరుకుతాయి. ఈ పిండి ఐదు రోజులు అయినా  పాడుకాదు. వీటితో పాటు పుల్లని పెరుగు కూర, నల్ల మిరియాల రసం, పప్పు కూరతో పాటు పుల్లగా, కారంగా, కొంచెం తియ్యగా ఉండే ‘గొజ్జు’ అనే రెసిపీలు... ‘ప్రమీలాస్​ కిచెన్​’ స్పెషల్. వీటిలో సరిపోను నీళ్లు కలిపి,  కూరగాయలు వేస్తే చాలు కర్రీ రెడీ.  ఎన్ని నీళ్లు  పోయాలి? ఏ కూరగాయలు వేయాలి? అనేవి ప్యాకెట్ మీద రాసి ఉంటాయి. 250 గ్రాముల రెడీ టు కుక్​ ఫుడ్​ ప్యాకెట్ ధర రూ. 165 నుంచి మొదలవుతుంది. 

పండ్లు, నట్స్​తో జామ్

పిల్లలు, పెద్దలు ఇష్టపడే జామ్​లోనూ వెరైటీలు తెచ్చింది చిత్ర. స్ట్రాబెర్రీ, ప్లమ్​, పైనాపిల్, వాటర్​మెలన్​, యాపిల్​, కమలా పండ్లకు పిస్తా, జీడిపప్పు వంటి నట్స్​ కలిపి తయారుచేసిన  జామ్స్ ఇక్కడ దొరుకుతాయి. వీటి తయారీలో పండ్ల తొక్కలు 70 శాతం, చక్కెర 30 శాతం వాడతారు.  ఇవి నిల్వ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్​ బదులు అల్లం, నిమ్మరసం కలుపుతారు. దాంతో ఈ జామ్స్​ మూడు నెలల వరకు తాజాగా ఉంటాయి. ఇవేకాకుండా చిల్లీ జామ, పైనాపిల్ చిల్లీ, స్వీట్ చిల్లీ, చిల్లీ టొమాటో పచ్చళ్లు కూడా అమ్ముతోంది చిత్ర.  వంద గ్రాముల జామ్​ ప్యాకెట్​ ధర 110 రూపాయలు. వాట్సాప్ ద్వారా ఆర్డర్​ తీసుకుని ‘టెలిపోర్ట్​’ కొరియర్​ సర్వీస్​ ద్వారా ప్రొడక్ట్స్​ని డెలివరీ చేస్తారు.  

విదేశాలకు కూడా...

“ నేను ఎమ్​సిజె (మాస్టర్​ ఆఫ్​ కమ్యూనికేషన్​ అండ్​ జర్నలిజం) చేశాను. పదేండ్ల పాటు హెచ్​ఆర్​గా పలు కంపెనీల్లో పనిచేశా. సొంతంగా బిజినెస్​ పెట్టాలని ఎప్పటినుంచో ఉండేది. దానికి తోడు  మా అమ్మ పుస్తకంలోని రుచుల్ని అందరికీ పరిచయం చేయాలని ఫుడ్​ స్టార్టప్ పెట్టా. ఇడ్లీ, దోసెల్లో కూడా వెరైటీ కోరుకునేవాళ్లు, ఫ్రూట్ జామ్స్​ని ఇష్టపడేవాళ్లు మా ప్రొడక్ట్స్​ ఎక్కువ కొంటారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చళ్లు ఎందుకు అమ్మడం లేదని అడుగుతుంటారు చాలామంది. అందుకు కారణం...  రోజులు గడిచేకొద్దీ వాటి రుచి తగ్గిపోతుంది. పైగా వాటి ప్యాకింగ్ కూడా ఛాలెంజ్. అందుకని మూడు నెలలు నిల్వ ఉండే పచ్చళ్లని అమ్ముతున్నాం. మా ఇన్​స్టంట్​ రెసిపీలు నచ్చడంతో వాటిని అమెరికా, కెనడా, లండన్​కి  కూడా  తీసుకెళ్తున్నారు కొందరు” అంటోంది చిత్ర స్వామి.  

::: సంతోష్​ బొందుగుల