
హైదరాబాద్‌సిటీ, వెలుగు: మూసీ ప్రక్షాళన పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది. ఇప్పటికే మూసీలోని నిర్మాణాలను చాలా వరకు తొలగించిన అధికారులు తాజాగా మూసీలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్‌మెంట్‌బ్యాంక్(ఏడీబీ) రూ. 4,100 కోట్ల నిధులు ఇవ్వడానికి గ్రీన్సిగ్నల్ఇచ్చింది. ఈ ఫండ్స్‌ను వివిధ దశల్లో చెల్లించనున్నట్టు అధికారులు తెలిపారు. కొన్ని రోజుల కింద ఏడీబీ మిషన్టీమ్ నగరాన్ని సందర్శించింది.
మూసీ ప్రాజెక్టు వివరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) అధికారులు వారికి వివరించగా, పర్యావరణపరంగా కూడా ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో నిధులిచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. నదికి ఇరువైపులా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్లాన్లు రూపొందించిన ప్రభుత్వం.. వివిధ ప్రాంతాల నుంచి మూసీలో వచ్చి కలుస్తున్న వరద, డ్రైనేజీ నీళ్లను వేరు చేసేందుకు ఇంటర్‌సెప్టర్ ఛానెల్నెట్వర్క్ నిర్మించనున్నది.
ఈ చానెళ్ల ద్వారా మురుగునీటిని మూసీకి పొడవునా ఆయా ప్రాంతాల్లో నిర్మించే ఎస్టీపీలకు చేరుస్తారు. ఎంఆర్డీసీఎల్అధికారులు 5,863 కోట్లతో ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి డిపార్ట్మెంట్ఆఫ్ఎకానమిక్స్అఫైర్స్కు అందజేశారు. డిటైల్డ్ టెక్నికల్ డిజైన్స్, ప్రూఫ్ఆఫ్ ఫైనాన్సియల్ వాయబులిటీ పై కూడా నివేదిక ఇవ్వగా, డీఈఏ స్ర్కీనింగ్కమిటీ రెండు నెలల క్రితమే ఆమోదించినట్టు తెలిసింది.
పూర్వ వైభవం తేవడానికి..
ఒకప్పుడు నగరానికి తాగునీటి అవసరాలు తీర్చిన మూసీ నది తర్వాత మురికికూపంగా మారిపోయింది. గతంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను తరలించి ఇందులో పోసిన ఘటనలున్నాయి. అలాగే, మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు పనికిరాని చెత్త, పశువుల కళేబరాలు, పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, ఇంట్లో పేరుకుపోయిన చెత్త, నగరంలోని కబేళాల నుంచి జంతువుల వ్యర్థాలు, డ్రైనేజీ వ్యర్థాలు ఇలా ఏది పడితే అది తెచ్చి మూసీలో వేయడంతో పనికిరాకుండా పోయింది.
వివిధ ప్రాంతాల నుంచి నాలాలు, డ్రైనేజీ నీరు నుంచి వేస్ట్ వాటర్ మూసీలోకే వదులుతున్నారు. దీంతో మూసీకి గత వైభవాన్ని తేవడానికి ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టును దక్షిణ కొరియాలోని హన్‌నది మాదిరిగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కొన్ని నెలల క్రితం అధికారుల బృందం సియోల్ వెళ్లి హన్ నదిని పరిశీలించింది. అదే స్పూర్తితో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ముందు మూసీలోని ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినా తర్వాత అంతా సర్ధుకున్నది. ఈ మొత్తం ప్రాజెక్టుకు దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చు కాగలవని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని పనులు ప్రభుత్వ నిధులతో చేపట్టడంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)పద్ధతిలోనూ చేపట్టనున్నారు. మూసీ శుద్ధి తర్వాత ఇందులోకి గోదావరి జలాలను నింపే విధంగా మరో ప్రాజెక్టు చేపట్టబోతున్నారు.
గౌరెల్లి నుంచి నార్సింగి వరకు..
తూర్పున ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి నుంచి పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు నార్సింగి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో ఇప్పటికే ప్లాన్లు రూపొందించారు. మూసీనది అభివృద్ధిలో భాగంగా షాపింగ్ మాల్స్, హోటల్స్, పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్‌లు, గ్రీన్‌వేలు, హాకర్‌జోన్లు, బ్రిడ్జీలు, వినోద, పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ రూపు రేఖలే పూర్తిగా మారిపోయే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. తాజాగా నగరంలో మూసీ పరివాహక సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో భాగంగా జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు మూసీలో ప్రవాహాలు ఎలా ఉన్నాయన్న దానిపై (హైడ్రాలజీ స్టడీ) అధ్యయనం కూడా పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఎక్కడెక్కడ నది వెడల్పు ఎంత ఉండాలని నిర్ధారించేందుకు గ్రామ నక్షాల (విలేజ్ రెవిన్యూ మ్యాప్‌ల)ను వినియోగించి నిర్ధారించనున్నారు.