పంట రుణాలు ఇవ్వలేమంటున్న బ్యాంకర్లు

పంట రుణాలు ఇవ్వలేమంటున్న బ్యాంకర్లు

టెక్నికల్​ ప్రాబ్లమ్స్​ ఉన్నయ్​.. లోన్లు ఇవ్వలేమంటున్న బ్యాంకర్లు

ఇటీవలే సీఎస్​కు లేఖ రాసిన స్టేట్​ లెవెల్​ బ్యాంకర్స్​ కమిటీ

లోన్లున్నయో లేవో చూడకుండానే మ్యుటేషన్​ చేస్తున్నరని అభ్యంతరం

తొందరగా సమస్యలు పరిష్కరిస్తేనే రైతులకు రుణాలిస్తమని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: పాస్​బుక్​లు లేకుండా ధరణిలోని వివరాలతోనే పంట రుణాలు తీసుకోవచ్చని సర్కారు చెప్పినా.. అదంత ఈజీ కాదంటున్నాయి బ్యాంకులు. ధరణిలో మస్తు టెక్నికల్​ సమస్యలున్నాయని, అవి పరిష్కారమయ్యే వరకు లోన్లు ఇవ్వలేమని తేల్చి చెప్పేశాయి. దీనికి సంబంధించి సీఎస్​ సోమేశ్​కుమార్​కు ఈనెల 7న స్టేట్​ లెవెల్​ బ్యాంకర్స్​ కమిటీ లేఖ రాసింది. ఏ సర్వే నెంబర్​లోని భూమికి ఎంత లోనుందో ఎమ్మార్వోలు చూడాలని, లోన్లున్న భూములను ఇంకొళ్లకు అమ్మి మ్యుటేషన్లు చేయకుండా అడ్డుకోవాలని సూచించింది. దానికి తగ్గట్టే ధరణి వెబ్​సైట్​ను మార్చాలంది. బ్యాంకుల్లో లోన్లున్నాయో లేదో చూడకుండానే కుటుంబ సభ్యుల పేర్లమీద సబ్​ సర్వే నెంబర్లతో మ్యుటేషన్లు చేస్తున్నారని, ధరణిలో ఎమ్మార్వో లాగిన్​లోనూ లోన్​ వివరాలు కనిపించట్లేదని చెప్పింది. అవేవీ చూడకుండానే మ్యుటేషన్లు చేస్తే ఆ భూముల మీద తీసుకున్న రుణాలు బకాయిలుగా మిగిలిపోయే ప్రమాదముందని పేర్కొంది. పాత పాస్​బుక్కుల్లో బ్యాంకు లోన్లు తీసుకున్నట్టు చూపించే రికార్డు ఉండేదని, ధరణి పోర్టల్​లోనూ అలాంటి రికార్డును పెట్టాలని లేఖలో బ్యాంకర్స్​ కమిటీ సూచించింది. ధరణి ఆన్​లైన్​ కావడం వల్ల డీసీసీబీల్లో మరిన్ని సమస్యలు వస్తున్నాయని వివరించింది. అసైన్డ్​, ఆర్​ఓఎఫ్​ఆర్​భూముల సర్వే నెంబర్లనూ ధరణిలో పెట్టాలని కోరింది. లోన్లపై ఆడిట్​ చేసేందుకు పహానీ, ల్యాండ్​ రికార్డ్​లను ప్రింట్​ తీసుకునేందుకు వీలు కల్పించాలని చెప్పింది. వీలైనంత తొందరగా సమస్యలను సాల్వ్​ చేస్తేనే రైతులకూ  పంట రుణాలు అందుతాయని తేల్చి చెప్పింది.

ఇప్పటిదాకా ఇచ్చిన లోన్లు 24% దాటలె

రాష్ట్రంలో యాసంగి సాగు మొదలై 2 నెలలవుతోంది. పంట రుణాలు మాత్రం 24 శాతం దాటలేదు. వానాకాలం (ఖరీఫ్​), యాసంగి (రబీ)కి కలిపి కూడా 70 శాతం దాటలేదు. గత ఖరీఫ్​ సీజన్​లో రూ.31,936 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, రూ.22,935 కోట్లే ఇచ్చారు. యాసంగిలో 21 లక్షల 74 వేల మంది రైతులకు రూ.21,286 కోట్ల మేర పంట రుణాలిచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, బ్యాంకర్స్​ కమిటీ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చింది రూ.5,084 కోట్లే. దాదాపు 5 లక్షల మందికే రుణాలు అందాయి. అందులోనూ కొత్తవి కాకుండా రెన్యువల్స్​ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా రెండు సీజన్లకు కలిపి పెట్టుకున్న టార్గెట్​లో రైతులకు అందిన రుణాలు కేవలం 52.65 శాతమే కావడం గమనార్హం.