
40% మించని యాసంగి రుణాలు
ఖరీఫ్, రబీలో ఇచ్చింది 54 శాతమే..
48 వేల కోట్ల టార్గెట్‌లో ఇచ్చింది రూ.26 వేల కోట్లే
వ్యవసాయ అనుబంధ రంగాలకు 21 శాతమే..
టర్మ్ రుణాలు 30 శాతం లోపే
వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: రైతులకు బ్యాంకులు అప్పులు ఇస్తలేవు. ప్రభుత్వం స్టేట్ లేవల్ బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించి ఆదేశాలు ఇస్తున్నా పరిస్థితిలో మార్పు ఉండటం లేదు. ఏటా బ్యాంకర్లకు పంట రుణాల విషయంలో టార్గెట్ పెట్టినా లక్ష్యం మేరకు రైతులకు ఇవ్వడం లేదు. ఈ ఏడాది యాసంగికి నీళ్లు అందుబాటులో ఉండటంతో గతంలో కంటే ఎక్కువగా సాగు జరుగుతోంది. కానీ బ్యాంకుల్లో రైతులకు రుణాలు అందలేదు. దీంతో అదును పోతుందన్న ఆందోళనతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రుణాలు ఇవ్వడం లేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే వ్యవసాయ పంట రుణాలు, అనుబంధ రంగాలు, టర్మ్ రుణాలు కలిపి 50 శాతం లోపే ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రెండు సీజన్లలో కలిపి సగమే
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణనలోకి తీసుకుని పంటల వారీగా రైతులకు రుణాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఏటా పంటల వారీగా రుణాల టార్గెట్ పెంచుతూనే ఉంది. అయితే అందుకు తగ్గట్లుగా అప్పులు అందడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్, రబీకి కలిపి పంట రుణాలు అందించేందుకు ఎస్‌ఎల్‌బీసీకి ప్రభుత్వం రూ.48,740.43 కోట్ల టార్గెట్ విధించింది. వానాకాలం (ఖరీఫ్)లో రూ.29,244.28 కోట్లు టార్గెట్ కాగా, రూ.18,711.77 కోట్ల రుణాలు మాత్రమే అందించాయి. ఇక యాసంగి(రబీ)లో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో మరింత వెనుకబడ్డాయి. రూ.19,496.15 కోట్ల పంట రుణాలు అందించాలని లక్ష్యం విధించగా.. కేవలం రూ.7,627.66 (39.12 శాతం) కోట్లు మాత్రమే రైతులకు అందాయి. రెండు సీజన్లు కలిపి 54.04 శాతం మాత్రమే బ్యాంకులు రుణాలు ఇవ్వడం గమనార్హం. రుణాల మంజూరులో బ్యాంకర్లు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
అనుబంధ రంగాలకు అంతంతే
వ్యవసాయ అనుబంధ రంగాలకు అందుతున్న రుణాలు కూడా అంతంత మాత్రమే. దీంతో హార్టికల్చర్, సెరికల్చర్, పౌల్ట్రీ, డెయిరీ రంగాలు పెద్దగా అభివృద్ధి సాధించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.8,410.92 కోట్ల రుణాలు మంజూరు చేయాలని టార్గెట్ పెడితే ఈ ఏడాది ఇప్పటి వరకు 21.81శాతం (రూ.1,834.25 కోట్లు) మాత్రమే ఇచ్చారు. టర్మ్ రుణాల విషయంలోనూ బ్యాంకర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది టర్మ్ రుణాలు రూ.11,445.36 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.3,430.25 కోట్లు మాత్రమే ఇచ్చారు. కనీసం 30 శాతం కూడా దాటకపోవడం గమనార్హం.
రైతులు పాత బాకీ కడతలేరు: బ్యాంకర్లు
రైతులు పాత అప్పులను చెల్లించడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పాత బాకీ చెల్లించని వారికి రైతుబంధు డబ్బులు పడితే… పంట వారీగా పాత బకాయి కట్ చేసుకుని మిగిలితేనే ఇస్తున్నారని రైతులు అంటున్నారు. అందుకే కొత్తగా రుణాలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.