ఆ ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైతే..

ఆ ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైతే..
  • లెక్కలోకి తీసుకోవద్దు.. ఆర్‌‌బీఐ 
  • ఉచిత ఏటీఎం లావాదేవీలపై బ్యాంక్‌లకు ఆదేశం

న్యూఢిల్లీ : సాంకేతిక కారణాలతో ఫెయిల్ అయిన  ఏటీఎం లావాదేవీలను ఉచిత ట్రాన్సాక్షన్స్‌‌గా లెక్కలోకి తీసుకోవద్దని బ్యాంకులను  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌బీఐ) ఆదేశించింది. ప్రతి నెలా కస్టమర్లకు అందించే ఉచిత ఏటీఎం లావాదేవీలపై పరిమితి విధించిన క్రమంలో ఆర్‌‌‌‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్ ట్రాన్స్‌‌ఫర్ కోసం ఏటీఎంలను వాడితే.. వాటిని కూడా  ఉచిత లావాదేవీలుగా పరిగణించొద్దని స్పష్టం చేసింది. బ్యాంక్‌‌లు తమ కస్టమర్లకు పరిమితమైన సంఖ్యలో మాత్రమే ఉచిత లావాదేవీలు అనుమతిస్తున్నాయి. అంతకుమించి ఏటీఎం లావాదేవీలు చేపడితే, ఛార్జీలను విధిస్తున్నాయి.

సాంకేతిక కారణాలతో లావాదేవీ ఫెయిల్ అయినా.. ఏటీఎంలలో కరెన్సీ అందుబాటులో లేకపోవడం వల్ల  ట్రాన్సాక్షన్  పూర్తి కాకపోయినా.. వాటిని కూడా బ్యాంక్‌‌లు ఉచిత ఏటీఎం లావాదేవీలుగానే లెక్కలోకి తీసుకుంటున్నట్టు ఆర్‌‌‌‌బీఐ గుర్తించింది.ఈ విషయాన్ని సీరియస్‌‌గా తీసుకుని ఆర్‌‌‌‌బీఐ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

హార్డ్‌‌ వేర్, సాఫ్ట్‌‌వేర్ వంటి టెక్నికల్ సమస్యలతో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా.. క్యాష్ లేకపోయినా వాటిని కస్టమర్లకు అందించిన వాలిడ్ ఏటీఎం లావాదేవీగా పరిగణలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆ ట్రాన్సాక్షన్స్‌‌పై ఎలాంటి ఛార్జీలను విధించకూడదని కూడా ఆదేశించింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్ బుక్ రిక్వెస్ట్, పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, ఫండ్ ట్రాన్స్‌‌ఫర్ వంటి నాన్ క్యాష్ విత్‌‌డ్రాయల్ లావాదేవీలను కూడా ఉచిత ఏటీఎం లావాదేవీల కిందకు తీసుకురావద్దని సూచించింది.

ప్రస్తుతం దేశంలో అతిపెద్ద బ్యాంక్‌‌ అయిన ఎస్‌‌బీఐ రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్‌‌కు ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలకు అనుమతిస్తోంది. వాటిలో 5 ఎస్‌‌బీఐ ఏటీఎంలలో, మూడు ఇతర బ్యాంక్‌‌ ఏటీఎంలలో చేపట్టుకోవచ్చు. నాన్ మెట్రోల్లో ఈ ఖాతాదారులు10 ఉచిత లావాదేవీలు చేపట్టవచ్చు. 5 ఎస్‌‌బీఐ ఏటీఎంలు, ఐదు ఇతర బ్యాంక్‌‌ ఏటీఎంలలో లావాదేవీలు జరుపుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌‌ మెట్రో ప్రాంతాల్లో తొలి 3 లావాదేవీలనే ఉచితంగా అందిస్తోంది. మిగతా ప్రాంతాల్లో ఐదు లావాదేవీలను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఆ తర్వాత రూ.20, రూ.8.50గా ఫీజులున్నాయి.

మొత్తం రెండు లక్షలకు పైగా ఏటీఎంలు…

కాగా, గత రెండు సంవత్సరాల నుంచి ఏటీఎంల సంఖ్య తగ్గిపోతోంది. దేశంలో ప్రస్తుతం 2,06,819 ఏటీఎంలేఉన్నట్టు ఆర్‌‌‌‌బీఐ డేటాలో తెలిసింది. వాటిలో సగానికి పైగా ఏటీఎంలు మూత పడబోతున్నట్టు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ గతేడాదే అంచనావేసింది. బ్యాంక్‌‌లు భారీగా విధిస్తోన్న ఛార్జీలను మార్చాలని కూడా ఆర్‌‌‌‌బీఐ చూస్తోంది. ఏటీఎం ఇంటర్‌‌‌‌ఛేంజ్‌‌ ఫీ విధానాన్ని సమీక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు జూన్‌‌లో ఆర్‌‌‌‌బీఐ ప్రకటించిన మానిటరీ పాలసీ ప్రకటన సందర్భంగా పేర్కొంది.