
ముంబై: చెక్కుల క్లియరెన్స్‌ను గంటల్లోనే పూర్తి చేసేందుకు ఆర్‌బీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం చెక్కు క్లియరెన్స్‌కు రెండు రోజుల వరకు పడుతోంది. ఈ కొత్త విధానం అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. చెక్కులను స్కాన్ చేసి, బ్యాంక్‌లకు పంపించి, కొన్ని గంటల్లోనే క్లియర్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్‌లో ఉన్న టీ+1 రోజుల క్లియరింగ్ సైకిల్‌ను కొన్ని గంటలకు తగ్గించనున్నారు.
ఈ కొత్త చెక్ ట్రంకేషన్ సిస్టం (సీటీఎస్)ను రెండు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశ అక్టోబర్ 4, 2025న, రెండో దశ జనవరి 3, 2026న ప్రారంభమవుతాయి. బ్యాంక్ బ్రాంచ్‌లకు వచ్చిన చెక్కులను వెంటనే స్కాన్ చేసి, క్లియరింగ్ హౌస్‌కు పంపించాలి. డ్రావీ బ్యాంక్‌లు (చెక్కు చెల్లించాల్సిన బ్యాంక్) క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కులను ఆమోదించాయా లేదా అని నిర్ధారించాలి. మూడు గంటల్లోగా ఆమోదం తెలపకపోతే, అవి ఆమోదించినట్లుగా భావించి సెటిల్మెంట్ చేస్తారు.