రైతుబంధు పైసలు క్రాప్​లోన్ వడ్డీకే!

రైతుబంధు పైసలు క్రాప్​లోన్ వడ్డీకే!
  • లోన్ రెన్యువల్ చేసుకోలేదని హోల్డ్‌‌లో రైతుల ఖాతాలు
  • వడ్డీ కట్ చేసుకున్నాకే ఇస్తామంటున్న మేనేజర్లు
  • వడ్డీ కింద రైతు బంధు పైసలు పోగా.. కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి
  • పైసలు డ్రా చేసుకోలేక ఆందోళనలో రైతులు
  • సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు తిప్పలు

నెట్‌వర్క్, వెలుగు: లక్ష లోపు పంట రుణాలను సర్కారు మాఫీ చేయకపోవడంతో రైతుబంధు పైసలు రైతులకు అందడం లేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే కారణంతో లక్షలాది మంది రైతులు తమ లోన్లను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో బ్యాంకులు వారి అకౌంట్లను హోల్డ్​లో పెట్టి.. ఖాతాల్లోని డబ్బులు తీసుకోకుండా ఫ్రీజ్ చేస్తున్నాయి. వడ్డీ కట్టి, లోన్ రెన్యువల్ చేసుకున్నాకే మిగిలిన పైసలు తీసుకోవాలని తేల్చిచెబుతున్నాయి. రైతుబంధు పైసలు వానాకాలం పెట్టుబడికి పనికివస్తాయనే ఆశతో బ్యాంకులకు వెళ్తున్న రైతులు.. తమ అకౌంట్లను హోల్డ్​లో పెట్టిన విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. కొందరైతే బ్యాంకుల ఎదుటే ఆందోళనకు దిగుతున్నారు. వానాకాలం సీజన్​లో రైతుబంధు కింద 63,25,695 మంది రైతుల ఖాతాల్లో రూ.7,508.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోంది. శుక్రవారం వరకు రాష్ట్రంలోని 49.48 లక్షల మంది ఖాతాల్లో రూ.4,095.77 కోట్లు వేసింది. అకౌంట్లలో రైతుబంధు డబ్బులు పడినట్లు రైతుల ఫోన్​కు మెసేజ్​లు వస్తున్నాయి. పెట్టుబడికి డబ్బులు దొరికాయని వారు సంతోషపడుతున్నారు. బ్యాంకుల ముందు రోజంతా క్యూ కడుతున్నారు. కానీ తీరా తమ వంతు వచ్చాక.. అకౌంట్లను హోల్డ్ లో పెట్టారని తెలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1.57 శాతమే మాఫీ
2018 డిసెంబర్ 11 లోపు రైతులు తీసుకున్న లక్ష, ఆ లోప్ క్రాప్ ​లోన్లను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్లలో పంట రుణమాఫీ కోసం బడ్జెట్​లో రూ.17,225 కోట్లు కేటాయించినా.. ఇప్పటిదాకా 409 కోట్లే ఖర్చు​చేసింది. ఈ మొత్తంతో రూ.25 వేల లోపు లోన్లు తీసుకున్న 2.96 లక్షల మంది రైతులకు లబ్ధి జరిగింది. మొత్తం మీద రూ.25,936 కోట్ల పంట రుణాలకు.. కేవలం 1.57 శాతం రుణాలే మాఫీ అయ్యాయి. మిగిలిన 37.70 లక్షల మంది రైతులకు ఎదురుచూపులే దిక్కయ్యాయి. దీంతో కొందరు రైతులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వడ్డీ కట్టి రెన్యువల్​ చేసుకుంటుండగా, రెన్యువల్ చేసుకోని రైతుల అకౌంట్లను బ్యాంకులు హోల్డ్​లో పెడుతున్నాయి.

రెన్యువల్ చేయించుకున్నాకే ఫ్రీజింగ్​ ఎత్తివేత
ఒకటి, రెండు జిల్లాల్లో తప్ప అన్ని చోట్ల క్రాప్​లోన్లను రెన్యువల్ చేసుకోని రైతుల అకౌంట్లను బ్యాంకులు హోల్డ్​లో పెడ్తున్నాయి. వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకున్నాకే రైతుబంధు సొమ్ము డ్రా చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో క్రాప్​లోన్ రెన్యువల్ ఫారం మీద సంతకం పెట్టించుని, మిగిలిన డబ్బు డ్రా చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. కామారెడ్డి, జనగామ జిల్లాలోని బ్యాంకర్లు.. వడ్లు అమ్మిన డబ్బుల్లోంచి కూడా లోన్ అమౌంట్ కట్ చేసుకుంటున్నారు.

ఇంకో వెయ్యి కట్టాలంట
గతేడాది రూ.లక్ష క్రాప్ లోన్ తీసుకున్న. రూ.13 వేలు రైతుబంధు డబ్బులు పడ్డయంటే తీసుకుందామని బ్యాంకుకు పోయిన. అవి మిత్తి కింద కట్ చేసుకున్నరు. ఇంకో వెయ్యి రూపాయలు కడితే మిత్తి తీరుద్దన్నరు. పెట్టుబడికి అక్కరకు వస్తయి అనుకుంటే రైతుబంధు పైసలను బ్యాంకోళ్లు పట్టుకున్నరు. ఇప్పుడు పెట్టుబడికి ఇబ్బందులు తప్పెతట్టు లేదు.
- మెనబొడ్డు నర్సయ్య, కట్కురు, బచన్నపేట మండలం, జనగామ జిల్లా

మూడేండ్ల నుంచి ఇస్తలే
నాకు నాలుగున్నర ఎకరాలు ఉంది. ఇందులో మూడెకరాలు పార్టు బీలో ఉంది. పాస్​బుక్ ఉన్న ఒక ఎకరా 20 గుంటలకు రైతు బంధు వచ్చింది. కానీ బ్యాంకులో మూడేండ్ల నుంచి రైతుబంధు పైసలు ఇస్తలేరు. క్రాప్ లోన్బా కీ ఉందని రైతు బంధు పైసలు పట్టుకుంటున్నరు. పెట్టుబడికి పైసలు లేక బయట మిత్తికి అప్పు చేసిన.
- బీమ్లా నాయక్, తాళ్లపల్లి గడ్డ తండా, మెదక్ జిల్లా

నేనే 3 వేలు కట్టాల్నంట
నాకు ఎకరం ఉంది. రెండేళ్ల కింద రూ.30 వేల క్రాప్​లోన్ తీసుకున్న. ఇప్పుడు రైతు బంధు పైసలు రూ.5 వేలు జమ అయితే.. తీసుకుందామని బ్యాంకుకు వచ్చిన. లోన్ మాఫీ కాలేదని, వడ్డీ కింద రూ.8 వేలు కట్టాలని బ్యాంకోళ్లు అంటున్నరు. వడ్డీ పోంగ ఉల్టా రూ.3 వేలు నేనే ఇవ్వాలంట.
- నీలం వెంకటయ్య, అలంకానిపేట, వరంగల్ రూరల్ జిల్లా

7 వేలు వడ్డీ కట్టించుకున్నరు
మా నాన్న జైనూర్ బ్యాంక్ లో క్రాప్ లోన్ తీసుకున్నరు. ఆయన అకౌంట్లో డబ్బులు ఉన్నయి. అయితే అకౌంట్ హోల్డ్ లో ఉందని, లోన్ రెన్యువల్ చేస్తేనే డ్రా చేసుకోవచ్చన్నారు. రూ.7 వేలు కట్టమంటే కట్టిన.
- ఆత్రం దత్తు, దుబ్బగూడ, కుమ్రంభీం జిల్లా

రైతుబంధు ఆపిన్రు
నాకు 2 ఎకరాల 27 గుంటలు భూమి ఉన్నది. రైతుబంధు కింద రూ.13,300 అకౌంట్​లో జమ అయ్యాయి. పైసలు తీసుకుందామని బ్యాంకుకు పోతే.. అకౌంట్ హోల్డ్ లో పెట్టినట్టు చెప్పిన్రు. క్రాప్ లోన్ రెన్యువల్ చేయాలని, బాకీ కట్టాలని అంటున్నరు. వచ్చిన పైసలు పెట్టుబడి కోసం తీసుకుందామంటే ఆపేస్తున్నరు.
- వసంత, మదనాపురం, వనపర్తి జిల్లా