కటింగ్‌ చేస్తారు.. గిఫ్ట్​లు ఇస్తారు

కటింగ్‌ చేస్తారు.. గిఫ్ట్​లు ఇస్తారు
  • ఎవరు లేకున్నా మేమున్నామంటున్న‘వీ ఫర్‌ ఆర్ఫన్స్‌’ సంస్థ
  • కుల వృత్తి తో పాటు వినూత్న సేవలో బార్బర్‌ రాకేష్ బృందం
  • వృద్ ధులు, దివ్యాంగులు, అనాథలకు ఫ్రీగా హెయిర్​ కటింగ్‌
  • సిటీలోని అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్‌ లో సేవలు

అనాథలకు సేవ చేయాలనే  దృఢ సంకల్పం వారిది.  అందరిలా కాకుండా వినూత్నంగా కులవృత్తితోనే సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు.  అనాథలు, మతిస్థిమితం లేనివారు, వృద్ధులు, వికలాంగులు, అంధులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఉచితంగా హెయిర్ కటింగ్​ చేస్తూనే అవసరమైన వస్తువులు, గిఫ్ట్​లను కూడా అందజేస్తోంది ‘వీ ఫర్‌ ఆర్ఫన్స్‌’ సంస్థకు చెందిన సీహెచ్ రాకేశ్​ టీం.

హైదరాబాద్​, వెలుగు : ముషీరాబాద్  రాంనగర్​ ప్రాంతానికి చెందిన రాకేశ్‌ బార్బర్‌. 2018లో ‘ వీ ఫర్‌ ఆర్ఫన్స్‌ (Vi for Orphans) సంస్థను  స్థాపించి సేవలు అందిస్తున్నారు.  సిటీలో మరి కొందరు  బార్బర్లు కూడా ఇతనికి మద్దతుగా నిలిచారు.  నర్సింగ్​, దుర్గాప్రసాద్​, విశాల్​, రమేష్​, సంపత్​, శ్రావణ్​, విద్య, యోగితా, నర్సింహలు అండగా ఉన్నారు.  ఒకవైపు కులవృత్తిని నిర్వహిస్తూనే, మరోవైపు అనాథలకు కటింగ్ చేసేందుకు టైం కేటాయిస్తున్నారు. రాకేశ్‌​ టీంకు సోషల్‌మీడియాలో పేరు రావడంతో ఇదే వృత్తిలో ఉన్న ఇంకొందరు యూత్‌ మేముసైతం ఉచితంగా కటింగ్​చేస్తామని ముందుకొస్తున్నారు.  సిటీలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అనాథలకు హెయిర్​ కటింగ్ ​చేస్తున్నారు. ఇటీవలి కాలంలో 1,600కు పైగా హెయిర్​ కటింగ్​ చేసి ప్రశంసలు పొందారు.

కటింగ్‌ చేయడమే కాదు

తొలుత ఇబ్రహీంపట్నంలోని అంధుల హోమ్​లను రాకేశ్‌ టీం సందర్శించింది.  20 నుంచి 30 వరకు ఆశ్రమాల్లోని  అనాథలు, వికలాంగులకు హెయిర్​ కటింగ్​తో సేవలను చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలై సిటీ వ్యాప్తంగా విస్తరించాయి. అనాథ ఆశ్రమాలకు వెళ్లి ఉచితంగా కటింగ్​ చేస్తుంది రాకేశ్‌ టీం. ఆ రోజు అనాథ పిల్లలతో కలిసి టీం మెంబర్స్‌ భోజనం చేస్తారు. పిల్లలకు ఇష్టమైన వస్తువులు, బిస్కెట్లను అందజేస్తారు. మెదక్​ జిల్లా నర్సాపూర్​ ఆరిబ్​ అనాథ ఆశ్రమంలోని అనాథలకు ఉచితంగా కటింగ్​చేశారు. ఇప్పటి వరకు వేలాది మందికి హెయిర్​ కటింగ్‌లు​ చేస్తున్న రాకేశ్‌ టీంను అనాథ ఆశ్రమాల నిర్వాహకులు, సామాజిక వేత్తలు, నాయీ బ్రాహ్మణ సంఘం పెద్దలు కూడా అభినందిస్తున్నారు.

సేవే లక్ష్యం

ఒకరోజు అనాథాశ్రమంలోని వారికి హెయిర్​ కటింగ్​చేసేందుకు వెళ్లా. అక్కడ కటింగ్​ చేసేందుకు కొందరు ముందుకు రాలేదని తెలుసుకున్నా. వాళ్లు మనుషులే కదా అని ఆలోచించా. అప్పటి నుంచి నేను ఉచితంగా చేసేందుకు నిర్ణయించుకున్నా. వృద్ధులకు హెయిర్​ కటింగ్​ చేయడంతో వారి ముఖాల్లో కొత్త కళను చూశా. అప్పటి నుంచి అనాథలకు హెయిర్​ కటింగ్​చేస్తున్నా. ఇందుకు ‘ Vi for Orphans ’ అనే సంస్థను ప్రారంభించా.  నిరుపేదలకు సేవ చేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నా.  మద్దతుగా నిలుస్తున్న అందరికీ ​కృతజ్ఞతలు. ‑ రాకేష్   ‘వీ ఫర్‌ ఆర్ఫన్స్‌’ నిర్వాహకుడు

చేస్తున్న సేవలివే..

  • స్ఫూర్తి అంధుల ఆశ్రమం
  • మాతృపితా వృద్ధాశ్రమం
  • అల్వాల్​లోని ఆశాజ్యోతి అనాథాశ్రమం
  • నాంపల్లి, బండ్లగూడలోని డాన్​బాస్కో నవ వజ్రం మూడు బ్రాంచ్‌లు
  • సికింద్రాబాద్​, తార్నాకలోని లోతుకుంట వృద్ధాశ్రమం
  • బోడుప్పల్ నారపల్లి ప్రాంతంలోని లహరి ఓల్డేజ్‌ హోమ్‌.. యాప్రాల్​లోని బ్లిస్​అనాథ ఆశ్రమం..విద్యానగర్​లోని స్ఫూర్తి బాలుర అనాథ ఆశ్రమం
  • సికింద్రాబాద్​ భోజిగూడ నవజీవన్​ హోమ్​
  • నాంపల్లిలోని షౌన్​కేర్​ ఆశ్రమం