విద్యార్థుల సమస్యలపై మంత్రి కామెంట్ కరెక్ట్ కాదు

విద్యార్థుల సమస్యలపై మంత్రి కామెంట్ కరెక్ట్ కాదు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఎలాంటి కనీస సౌకర్యాలు లేక జైలు కంటే దారుణంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండడంపై స్పందించిన ఆయన ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించేందుకు వచ్చారు. విద్యార్థుల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రిపుల్ ఐటీకి వచ్చిన నారాయణను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని తరలించారు. 
పోలీసుల వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీలో పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘పోలీసుల క్యాంపులాగా పెట్టారు.. విద్యార్థులకు భోజనం సరిగా లేదు.. బాత్ రూములు కూడా బాగా లేవు.. 200 మంది ఉపాధ్యాయులు లేరు.. వైస్ ఛాన్స్ లర్ లేరు.. సెంట్రల్ జైలు కంటే.. దారుణంగా ఉంది.. విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తే.. సిల్లీ పాయింట్ అంటోంది.. విద్యార్థులు జైలు కంటే దారుణమైన పరిస్థితుల్లో ఉండడం సిల్లీ పాయింటా..? చదువు రాని మంత్రి వ్యాఖ్యలు సరికాదు.. మీ పిల్లలు చదువుకుంటే.. తెలిసేది.. విద్య లేని వాళ్లని.. విద్యా మంత్రిని.. సమైక్యవాదులను తెలంగాణ క్యాబినెట్ లో పెట్టుకుని నడిపిస్తున్నారు...’ అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని, విద్యార్థులు కనీస సౌకర్యాలు మాత్రమే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.